మన భారతీయ ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌కు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అలెఘనీ కౌంటీ జూన్ 22వ తేదీని ‘గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ రోజు’గా నిర్వహించింది. శ్రీశ్రీ రవిశంకర్ గౌరవ దినోత్సవం నిర్వహించిన 27 నగరాల సరసన ఇప్పుడు అలెఘనీ కౌంటీ కూడా చేరింది. నగర ప్రాంతంలో హింస, నేరాలను తగ్గించి, వివిధ వర్గాల ప్రజలను స్వచ్ఛంద సేవ, సామాజిక కార్యకలాపాలవైపు మళ్లించి వారిని ఏకీకృతం చేసేందుకు చేపట్టిన చర్యలను గుర్తిస్తూ ఏటా జూన్ 22వ తేదీన శ్రీశ్రీ రవిశంకర్ గౌరవ రోజుగా జరుపుకోబోతున్నట్లు కౌంటీ ఎగ్జిక్యూటివ్ రిచ్ ఫిట్జ్‌గెరాల్డ్ ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ రవిశంకర్‌ను ‘ప్రపంచ మానవతావాదిగా, ఆధ్యాత్మిక నాయకుడిగా, శాంతి దూతగా’ ఆయన కొనియాడారు.
‘భిన్న సంస్కృతుల, వైరుధ్యాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడంపై గురుదేవ్ దృష్టి సారించారు. వివిధ సామాజిక వర్గాల ప్రజలను స్వచ్ఛంద, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమైక్యపరచి, తద్వారా ఆయా ప్రాంతాలలో నేరాలను, హింసను తగ్గించేందుకు వారు చేస్తున్న కృషి అమోఘం. వివిధ దేశాల సంస్కృతులు, సమాజాలను దగ్గర చేసేందుకు, ఒక ప్రపంచ మానవాతావాదిగా సంఘర్షణలను నివారించేందుకు గురుదేవ్ విశేష కృషి చేస్తున్నారు. స్వచ్ఛంద, సామాజిక సేవను ఒక ఉద్యమంలా ప్రజలలో వ్యాపింపజేసేందుకు వారు చేసిన కృషికి, నేడు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న కోట్లాది మంది కార్యకర్తల స్ఫూర్తి, వారు సమాజాలను బలోపేతం చేస్తున్న తీరు నిదర్శనంగా నిలుస్తుంది’ అంటూ అలెఘనీ కౌంటీ విడుదల చేసిన ప్రశంసాపత్రంలో పేర్కొన్నారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా శ్రీశ్రీ రవిశంకర్ చేస్తున్న మానవ సేవా కార్యక్రమాలు ఇప్పటికే విశేష గుర్తింపు పొందాయి. 5 దేశాల నుంచి ఆయన అత్యున్నత పౌర పురస్కారాలను అందుకున్నారు. 39కి పైగా ప్రపంచ దేశాల నుంచి అవార్డులు, 26 గౌరవ డాక్టరేట్‌లను అందుకున్నారు. 28 నగరాలలో గురుదేవ్ పేరిట గౌరవ దినోత్సవాలు జరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరు 29 నుంచి అక్టోబర్ 1 వరకు వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్ స్టేడియంలో ప్రపంచ శాంతి, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఉత్సవాలలో అతి పెద్దదైన ‘ది వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్’ కు శ్రీశ్రీ సారథ్యం వహిస్తుండటం మరో విశేషం