ఏపీలో గత మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల వల్ల ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. అయితే రానున్న మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని వల్ల రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని చెబుతున్నారు. రెండు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.
ఆదివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఇక సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
అలాగే 27వ తేదీ ఏలూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో చెట్ల కింద ఉండకపోవడం మంచిదని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని తెలిపింది.