స్వచ్ఛసర్వేక్షణ్-2023 పోటీకి జీవీఎంసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వచ్చేనెల రెండోవారంలో కేంద్ర బృందం విశాఖలో ఐదు రోజులపాటు సర్వే నిర్వహించే అవకాశం ఉందనే సమాచారంతో అప్రమత్తమయ్యారు. పోటీలో మొదటి ర్యాంక్ దక్కించుకోవడమే లక్ష్యంగా అన్ని విభాగాల్లోనూ ఉత్తమ ప్రతిభ చూపేందుకు కమిషనర్ సాయికాంత్‌వర్మ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ క్షేత్రస్థాయి పర్యటనలు చేయడంతో పాటు అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.
మొదటి ర్యాంక్ లక్ష్యంగా ప్రణాళికలు
స్వచ్ఛసర్వేక్షణ్-2023లో పది లక్షలు జనాభా దాటిన నగరాల కేటగిరీలో మొదటి ర్యాంక్ సాధించడమే లక్ష్యంగా జీవీఎంసీ అధికారులు ప్రణాళికలు రచించి, అమలుచేస్తున్నారు. స్వచ్ఛసర్వేక్షణ్ ప్రారంభమైన 2015లో జీవీఎంసీ ఈ కేటగిరీలో 237, 2016లో ఐదు, 2017లో మూడు, 2018లో ఏడు, 2019లో 23, 2020లో తొమ్మిదో ర్యాంక్ సాధించింది. 2021లో కరోనా కారణంగా సర్వే నిలిచిపోగా, 2022లో మూడో ర్యాంక్‌కు ఎగబాకింది. ఈ ఏడాది మరింత ఉత్తమ ప్రతిభ చూపడం ద్వారా మొదటి ర్యాంక్ సాధించడమే ధ్యేయంగా కమిషనర్ సాయికాంత్‌వర్మ కార్యాచరణ ప్రకటించారు.