శ్రీవాణి ట్రస్టులో ఎటువంటి అవకతవకలు జరగడం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. అవగాహన లేకుండానే కొందరు శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణలు చేస్తున్నారని తోసిపుచ్చారు. పింక్ డైమండ్, నేలమాలిగలు తరలించారంటూ గతంలో కూడా టీటీడీపై అపోహలు సృష్టించారని తెలిపారు. ఇవ్వన్నీ ఆరోపణలేనని అప్పట్లోనే ఖండించానన్నారు. అయినా భక్తుల్లో ఉన్న అనుమానలను టీటీడీ తీర్చాల్సిందేనని పేర్కొన్నారు. ప్రతీ నెల 1వ తేదీన శ్రీవాణి ట్రస్టుకి ఎన్ని విరాళాలు వస్తున్నాయో టీటీడీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దూప దీప నైవేద్యలు లేని ఆలయాలకు శ్రీవాణి ట్రస్టు ద్వారా నిధులు కేటాయించాలని కోరారు. అలాగే మత్స్యకార్య ప్రాంతాల్లోని 574 ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పింక్ డైమండ్‌పై టీటీడీ వేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టుకి రెండు కోట్ల రూపాయల భక్తుల డబ్బును చెల్లించారని.. ఆ సొమ్మంతా టీటీడీ పాలకమండలి, అధికారులు వడ్డీతో సహా టీటీడీకీ చెల్లించాలని భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు.