ఏపీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర హీట్ కొనసాగుతోంది. జనసేనానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వరుసగా రెండు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్‌సీపీ కూడా ముద్రగడకు మద్దతుగా నిలిచింది.. పవన్‌ను టార్గెట్ చేస్తోంది. ముద్రగడ లేఖలపై ఇప్పటి వరకు జనసేన అధినేత స్పందించలేదు.. అయితే మలికిపురంలో జరిగిన సభలో మాత్రం ముద్రగడ టాపిక్ హైలైట్ అయ్యింది. పద్మనాభంకు పవన్ గౌరవం ఇచ్చారు.
మలికిపురంలో వారాహి విజయ యాత్ర సభ జరిగింది. ఈ సభలో పవన్ ప్రసంగిస్తుండగా.. ముద్రగడకు వ్యతిరేకంగా జనసైనికులు బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. వెంటనే జనసేనాని గమనించారు.. పెద్దవాళ్లను గౌరవించాలంటూ ఆ ఫ్లెక్సీలను తీసేయాలని జనసైనికుల్ని కోరారు. 'పెద్దవాళ్లు ఓ మాటంటుంటారు.. మనం దాన్ని తీసుకోవాలి' అన్నారు. ముద్రగడను గౌరవించాలని, తన మాట వినాలని జనసేన కార్యకర్తలను కోరారు. పద్మనాభం అంటే పవన్‌కు చాలా గౌరవం అంటూ జనసైనికులు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
పచ్చటి గోదావరి జిల్లాల్లో పులివెందుల నుంచి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారన్నారు పవన్. తమ మీద ఒక్క రాయి పడినా, ఒక్క చేయి పడినా, ఆడపడుచులను ఒక్క మాట అన్నా సరే వైఎస్సార్‌సీపీ క్రిమినల్స్‌ను తన్ని తగలేస్తామన్నారు. క్రిమినల్స్, చైన్‌గ్యాంగ్స్, రౌడీలను పులివెందులలోని ఇడుపులపాయలో పెట్టుకోవాలని.. ఇక్కడకు తీసుకురావద్దు అన్నారు. ఎక్కడో కూర్చొని బటన్ నొక్కడం కాదు.. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నారు.
బాధ్యతలేని రాజకీయ నాయకులు ఓట్లు వేయించుకుని వెళ్లిపోతారు.. మళ్లీ ఎన్నికలకు వస్తారన్నారు జనసేనాని. ఓట్లేసుకుని వెళ్లిపోతే ఊరుకోం.. మెడపట్టి లాగుతాం అన్నారు. బాంచన్ దొర కాలు మొక్కుతా అనే వ్యక్తులం కాదని.. బాగా పరిపాలించి ఇంకోసారి గెలవాలన్నారు. ఉభయ గోదావరి జిల్లాలను వైఎస్సార్‌సీపీ నుంచి విముక్తి చేయాలని.. ఇక్కడ ఉన్న 34 అసెంబ్లీ సీట్లలో ఒక్క సీటు కూడా ఆ పార్టీ గెలవకూడదు అన్నారు. తిరుమల శ్రీవాణి ట్రస్టు నిధులను ఇక్కడ కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణానికి ఖర్చు చేయడం అనుమానంగా ఉందన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధుల విషయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై నమ్మకం లేదన్నారు.
సీఎం జగన్ హెలికాప్టర్లో తిరగడం కాదు.. ప్రజల్లోకి వచ్చి వారు పడుతున్న కష్టాలు చూడాలన్నారు. జగన్ దళితులకు మేనమామనంటూ వారి సంక్షేమానికి ఉపయోగపడే 23 పథకాలను రద్దు చేశారన్నారు. క్రిమినల్స్‌ను, రౌడీలను, అక్రమాలకు పాల్పడేవారిని సీఎం వెనకేసుకొస్తుంటే రాష్ట్రం ఏమవుతుందని ప్రశ్నించారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదని.. దాడి చేస్తే చూస్తూ ఊరుకునే వ్యక్తిని కాదన్నారు. హత్యలు చేసి ఊరేగింపులు చేసుకుంటున్నారని.. ఓట్లను బోట్లుగా చేసుకుని గోదావరి దాటి అసెంబ్లీకి వెళ్లిన రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వంటి వారిని రీకాల్ చేసే హక్కు ప్రజలకు ఉండేలా చట్టాలు తీసుకురావాలని వ్యాఖ్యానించారు.