ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, 202 రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో విషం కలిపిన కల్లు తాగి ఐదుగురు గిరిజనులు మృతి చెందడంతో ఐదు బాధిత కుటుంబాలకు ఎట్టకేలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మూడు లక్షల రూపాయల చొప్పున అందించారు. సంబంధిత చెక్కులను సోమవారం ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి గిరిజనుల కుటుంబ సభ్యులు బూసరి బోడమ్మ,కుడే గంగ, పొత్తూరి లోవ, పోలిశెట్టి ఏసమ్మ, వేమ మంగకు అందజేశారు. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ మాట్లాడుతూ గిరిజనులు చనిపోయిన రోజే బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చామని మాట ప్రకారమే చెక్‌లు అందజేశామన్నారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ లోదొడ్డిలో జరిగిన విషాద ఘటనపై అసెంబ్లీలో నాలుగు సార్లు మాట్లాడడం ప్రజలు చూశారని ముఖ్యమంత్రి స్పందించి ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల రూపాయలు అందించారన్నారు.