ఇంటింటి సర్వేలో భాగంగా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి సకాలంలో చికిత్స అందించాలని, వ్యాధిని సమూలంగా నిర్మూలించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు అన్నారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జూలై 16వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించే కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా కుష్టు వ్యాధిపై ప్రచురించిన అవగాహన పోస్టర్లు, కరపత్రాలను సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ దిల్లీరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటి సర్వే ద్వారా కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ సహకరించి శాశ్వత లోపాలు, అంగవైకల్య బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, గ్రామ వలంటీర్లతో ఇంటింటి సర్వేలో వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించడం జరుగుతుందన్నారు. తొలి దశలోనే చికిత్స అందించడం ద్వారా వ్యాధిని అరికట్టవచ్చన్నారు. కుష్టు వ్యాధిని జిల్లాలో సమూలంగా నిర్మూలించి వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వైద్యాధికారులను కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, డీఆర్‌వో కె.మోహన్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.సుహాసిని, జిల్లా లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఉషారాణి, లేప్రా ఎన్‌జివో స్టేట్ కో-ఆర్డినేటర్ రాధిక తదితరులు పాల్గొన్నారు.