తెలుగుదేశం పార్టీ జోన 5 నాయకులు చేపట్టిన ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ బస్సు యాత్ర కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకూ సాగిన బస్సు యాత్ర, రైతులతో ముఖాముఖి, రచ్చబండ సభకు టీడీపీ కార్యకర్తలు, రైతులు, ప్రజలు, మహిళలు భారీగా తరలివచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యం ఇచ్చిందని నియోజకవర్గ ఇనచార్జి ఉమా మహేశ్వరనాయుడు అన్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తేనే రైతు సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. జగన రెడ్డిని దించి, చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆలోచించిన దార్శనికుడు చంద్రబాబు అని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. రాష్ట్రంలో క్వార్టర్ బాటిల్ తాగే ప్రతి కూలీ నుంచి రూ.100 ప్రకారం తాడేపల్లి ప్యాలెస్‌కు వెళుతున్నాయని పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్ అన్నారు. ఇసుక, మట్టి, కంకర నుంచి ఇంకా ఎంత సొమ్ము వెళుతోందో ఊహించుకోవచ్చని అన్నారు. ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో అందరి అప్పులూ పెరిగాయని, ఒక్క జగన ఆస్తులు మాత్రమే పెరిగాయని విమర్శించారు. టీడీపీ బస్సు యాత్రకు జనం అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. నాయకులకు హారతి పడుతూ, గజమాలలో అభిమానం చాటుకున్నారు. కార్యక్రమంలో పార్టీ ఉమ్మడి జిల్లా పరిశీలకులు బీటీ నాయుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, మాజీ మేయర్ స్వరూప, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్ మొద్దీన తదితరులు పాల్గొన్నారు.