భారత రాష్ట్ర సమితిపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మంగళవారం బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కుటుంబంపై విమర్శలు గుప్పించారు. ‘కరుణానిధి కుటుంబ సంక్షేమం కావాలంటే డీఎంకేకు ఓటు వేయండి.. కే చంద్రశేఖర్ రావు కుమార్తె కవిత క్షేమం కావాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి.. అయితే మీరు మీ కొడుకులు, కూతుళ్లు, మనవళ్ల సంక్షేమం కోరుకుంటే బీజేపీకి ఓటేయండి’ అని మోదీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతోందన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె కవితపై కేసు దర్యాప్తు ఇటీవల దూకుడు తగ్గడంతో బీజేపీ, బీఆర్ఎస్‌లు దగ్గరవుతున్నాయనే ప్రచారం జోరందుకుంది. కేంద్రం వైఖరిలో మార్పు బీజేపీలోని ఒక వర్గం నాయకులను అసంతృప్తికి గురిచేసింది. వీరిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌కు చెందిన 35 మంది కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. బీఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిశారు. వీరు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది.
రెండేళ్లుగా కేంద్ర సమావేశాలను బహిష్కరిస్తూ వస్తోన్న బీఆర్ఎస్.. అనూహ్యంగా మణిపూర్ హింసపై అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. కొన్నేళ్లుగా ఆ పార్టీ కొనసాగించిన వైఖరిలో మార్పులు చోటుచేసుకోవడంతో బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య అవగాహన కుదిరిందనే ఊహాగానాలు మొదల్యాయి.
మోదీని విమర్శించడంలో ముందుండే తెలంగాణ సీఎం.. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయనను ‘మంచి మిత్రుడు’ అని అభివర్ణించారు. అలాగే, విపక్షాలు పాట్నాలో భేటీ నిర్వహిస్తున్న సమయంలో కేటీఆర్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలవడానికి ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల కిందట విపక్షాల వ్యూహాత్మక సమావేశంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘మేం ప్రజలను ఏకం చేయడాన్ని నమ్ముతాం. రాజకీయ పార్టీలను ఏకం చేయడాన్ని కాదు. ఐక్యత అనేది ప్రజల్లో రావాలి కానీ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలు ఏకం కావడం సరికాదు’’ అన్నారు
ఢిల్లీ మద్యం కేసులో కవిత పేరు రెండు చార్జిషీట్లలో ఉండగా.. ఏప్రిల్‌లో దాఖలు చేసిన మూడో ఛార్జిషీట్‌లో మాత్రం ఆమె పేరు తొలగించారు. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ దగ్గరవుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనుండగా.. వీటిని వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మధ్యప్రదేశ్‌లో మళ్లీ అధికారం నిలబెట్టుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం లాంఛనంగా అక్కడ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ బూత్ స్థాయి వర్కర్లతో సమావేశమై ఎన్నికలపై దిశనిర్దేశనం చేశారు.