చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలో 17 ఏళ్ల ఓ అమ్మాయి స్కూల్ మెట్లు ఎక్కుతుండగా.. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైంది. పాఠశాల సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ప్రాణాలో కోల్పోయిందని వైద్యులు తెలిపారు. నవ్‌సారి జిల్లాకు చెందిన తనీషా గాంధీ (17) ఏబీ పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతోంది. మంగళవారం (జూన్ 27) ఉదయం పాఠశాల విరామ సమయంలో తన స్నేహితులతో కలిసి మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా అసౌకర్యానికి గురైంది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, శరీరం చెమటలు పట్టి కుప్పకూలిపోయింది.
మెట్లను ఆనుకొని ఉన్న రెయిలింగ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. శరీరం సహకరించక కిందకూలిపోయి, స్పృహ కోల్పోయింది. తోటి స్నేహితురాళ్లు ఆమెకు సాయం అందించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఆమెను దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.
‘తనీషా చాలా తెలివైన అమ్మాయి. డాక్టర్ అవ్వాలనే లక్ష్యంతో చదువుకుంటోంది’ అని ప్రిన్సిపల్ అమృత్ ఛత్రోల చెప్పారు. తనీషా రెండేళ్ల కిందటే తల్లిని కోల్పోయింది. తల్లి లేని అమ్మాయికి అన్నీ తానై చదివిస్తున్నారు ఆమె తండ్రి. ఈ విషాద ఘటన ఆయణ్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
టీనేజర్లలో గుండెపోటు సమస్యలు ఇటీవల పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొంత మందిలో పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, వ్యాధులు కూడా కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇక పిల్లలో గుండె జబ్బులకు ఎక్కువగా కారణమవుతున్న మరో అంశం రుమాటిక్ జ్వరం (Rheumatic Fever). ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ల కంటే ఎక్కువ మంది పిల్లలను ఇది ప్రభావితం చేస్తోందని వైద్యులు చెబుతున్నారు. రుమాటిక్ జ్వరానికి తక్షణమే చికిత్స చేయలేకపోతే, దీర్ఘకాలిక గుండె జబ్బులు సంభవించవచ్చునని అధ్యయనాలు చెబుతున్నాయి.