సాహితీ పార్మా కంపెనీలో జరిగిన పేలుడు వల్ల మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలంటూ అఖిలపక్షం యకులు నిర్వహించిన ఆందోళనకు కంపెనీ యాజమాన్యం దిగివచ్చింది. తెదేపా, జనసేన, వైకాపా, సీపీఎం, సీఐటీయూ నాయకులతో పరిహారంపై చర్చించడానికి ముగ్గురు కంపెనీ డైరెక్టర్లు హాజరయ్యారు. విశాఖ ఎల్జిపాలిమర్స్ కంపెనీలో మృతుల కుటుంబాలకు అందించినట్లే రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి కంపెనీ డైరెక్టర్లు అంగీకరించకపోవడంతో గతంలో లారస్ లాబ్లో బాధిత కుటుంబాలకు రూ. 75 లక్షలు అందించారని, ఇక్కడా ఇవ్వాలని కోరారు.
దీనికి వారు అంగీకరించలేదు. పలు విడతలుగా జరిగిన చర్చల్లో ప్రభుత్వం చెల్లించిన రూ. 25 లక్షలతో పాటు బాధిత కుటుంబాలకు రూ. 9 లక్షల చొప్పున 34లక్షలు నష్ట పరిహారం అందివ్వడానికి అంగీకారం కుదిరింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎవరైనా మృతి చెందినా రూ. 9 లక్షలచొప్పున పరిహారం ఇవ్వడానికి డైరెక్టర్ అంగీకరించి ఒప్పందం రాసుకున్నారు. ఈ చర్చల్లో జనసేన నాయ కుడు జైలపూడి రాందాసు, తెదేపా నాయకులు నీరుకొండ నర్సింగరావు, రాజు, డ్రీమ్స్ నాయుడు, ఈండ్ర అప్పలనాయుడు, సీపీఎం తరపున రొంగలి రాము, సోమునాయుడు, సీఐటీయూకు చెందిన కోటేశ్వరరావు, వైకాపా నుంచి రాజాన విజయ్ పాల్గొన్నారు.