పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో సంస్కరణలు తెచ్చారని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు సోమవారం అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఎమ్మెల్యే రెండో రోజు పర్యటించారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి తిరిగి అందించారు. సంక్షేమ పథకాలను, ప్రభుత్వ లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్ల సేవలపై ఆరా తీశారు. స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు సంయుక్తంగా గ్రామాలలో పర్యటించడంతో సందడి వాతావరణం నెలకొంది. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో గ్రామస్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. దీంతో పాటు ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి సమస్యలు తెలుసుకుంటున్నామన్నారు. వాటిని పరిష్కించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో అవినీతి లేని పారదర్శక పాలన సాగుతోందని. ప్రజలంతా జగనన్న పాలనపై అంతులేని నమ్మకాన్ని చూపిస్తున్నారన్నారు. ప్రతి గడపలో తనకు అందుతున్న ఆపూర్వ ఆదరణే దానికి సాక్ష్యమన్నారు. వెంకటాయపాలెంలో రూ. 5. 11 కోట్లతో సంక్షేమ పథకాలు అందించామన్నారు. గ్రామంలో అభివద్ధి పనుల కోసం రూ. 4. 73 కోట్లు ఖర్చు చేశామన్నారు. రూ. 2. 60 కోట్లతో గ్రామంలో అంతర్గత రోడ్లు నిర్మించామన్నారు. మరో రూ. 2. 13 కోట్లతో సచివలయం, రైతుభరోసా కేంద్రం, హెల్త్ వెల్ నెస్ సెంటర్లు నిర్మించామన్నారు. రూ. 41 లక్షలతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించేందుకు పనులు చేస్తున్నారన్నారు. పాఠశాలల అభివృద్ధికి నాడు నేడు ద్వారా రూ. 41 లక్షలు ఖర్చు చేశామన్నారు. జగనన్న ఆశయాలను ఆచరణలో పెడుతున్న తన పాలనలో మేలు జరిగిందని నమ్మితే తనను ఆశీర్వదించమని అడుగుతున్నానని చెప్పారు.