విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలను అడ్డుకోవడానికి చేస్తున్న పోరాటానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొనేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన రాహుల్.. ఏపీ కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, మస్తాన్‌వలీ తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి రాహుల్ దృష్టికి కాంగ్రెస్ నేతలు తీసుకువచ్చారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఏఐసీసీ స్థాయిలో పోరాటం చేయాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా విశాఖ పర్యటనకు రావాలని కోరారు. ఇందుకు సమ్మతించిన రాహుల్ మాట్లాడుతూ... ‘జూలై, ఆగస్టు నెలల్లో విశాఖకు వస్తా. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. ఇందుకు ఏఐసీసీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేందుకు కూడా పూర్తి సంఘీభావం తెలుపుతుంది. ఇందుకోసం కాంగ్రెస్ యువ నాయకురాలు ప్రియాంకాగాంధీ రాష్ట్రానికి వస్తారు. ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చిత్తశుద్ధితో ఉంది’ అని స్పష్టం చేశారు. కాగా.. ఖమ్మం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం చేరుకున్న రాహుల్ వెంట తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు వచ్చి వీడ్కోలు పలికారు.