వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని టీడీపీ సీనియర్ నాయకులు పలువురు ఆరోపించారు. కాకినాడ జిల్లా గండేపల్లిలో ఆదివారం భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర నిర్వహించారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్ జవహర్, చిక్కాల రామచంద్రరావు, పీతల సుజాత, గొల్లపల్లి సూర్యారావు మాట్లాడారు. యనమల మాట్లాడుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం రైతులు, బలహీన వర్గాల అభ్యున్నతే అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అతి ప్రధానమైన వారు రైతులని, వాళ్లు బాగుండాలంటే మళ్లీ టీడీపీ రావాలని స్పష్టం చేశారు. రైతులను అభివృద్ధి చేస్తే ఆర్థికాభివృద్ధి రేటు పెరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని, సరైన గిట్టుబాటు ధర కల్పించడం లేదని, దళారుల రాజ్యం పెరిగిపోయిందని విమర్శించారు.