చార్‌ధామ్ యాత్రలో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయం ఇటీవలె ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి కేదార్‌నాథ్ శివలింగాన్ని దర్శించుకుంటున్నారు. కానీ ఓ యువతి చేసిన పనికి ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేదార్‌నాథ్ ఆలయం ముందే తన బాయ్‌ఫ్రెండ్‌కు లవ్ ప్రపోజ్ చేసింది. ప్రియుడికి ఉంగరం తొడిగి తన ప్రేమను వ్యక్త పరిచింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి చేష్టలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ఇద్దరు యువతీ యువకులు పసుపు రంగు బట్టలతో కేదార్‌నాథ్ ఆలయం ముందుకు వచ్చారు. ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకున్నారు. యువతికి వెనుక నుంచి మరొకరు ఉంగరం ఉన్న డబ్బాను అందించారు. ఆ యువకుడు కళ్లు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంటుండగా.. ఆ యువతి ఉంగరాన్ని తీసుకుని మోకాళ్లపై కూర్చొని ఉంది. కళ్లు తెరచిన యువకుడు ఆ యువతిని చూసి షాక్ అయ్యాడు. ఆమె వెంటనే తన లవ్‌ను ప్రపోజ్ చేసి.. చేతిలో ఉన్న ఉంగరాన్ని ప్రియుడి వేలికి తొడిగింది. దీంతో ఆ యువతి ప్రేమను అంగీకరించిన యువకుడు.. ఆమెను పైకి లేపి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ వ్యవహారం మొత్తాన్ని వారి స్నేహితులు వీడియో తీశారు. అందులో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియోకు కొద్ది గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
కేదార్‌నాథ్ ఆలయం ముందు లవ్ ప్రపోజల్‌పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయం ముందు ఇలా చేయడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. ప్రముఖ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, మత పరమైన ఆలయాల పరిసరాల్లో స్మార్ట్‌ఫోన్లను నిషేధించాలి అని పేర్కొంటున్నారు. పవిత్రమైన ప్రదేశాల్లో ఇలాంటి పనులు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలతో భక్తితో దేవాలయాలకు వచ్చిన వారు అసౌకర్యానికి గురవుతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఆలయాలకు 20 కిలోమీటర్ల పరిధిలో కేవలం బేసిక్ ఫోన్లను మాత్రమే అనుమతిస్తే ఇలాంటి వాటిని అడ్డుకోవచ్చని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పనులు ఆలయ మర్యాదలను మంటగలపడమేనని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం యువతీ యువకులు చేసిన పని చాలా క్యూట్‌గా ఉందని.. పేర్కొంటున్నారు. అయితే వారు ఎవరు అనే విషయాలు వెల్లడి కాలేదు.