ప్రపంచంలోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాల్లో థాయిలాండ్ ఒకటి. థాయిలాండ్ వెళ్లేందుకు ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు వెళ్తూ ఉంటారు. మన దేశం నుంచి కూడా చాలా మంది పర్యాటకులు థాయిలాండ్ వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రోడ్డు మార్గంలో కూడా థాయిలాండ్ చేరుకోవచ్చని తెలిపింది. అత్యంత పొడవైన జాతీయ రహదారి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
భారత్ నుంచి థాయిలాండ్‌కు రోడ్డు మార్గం నిర్మించాలని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ తొలిసారి ప్రతిపాదించారు. ఈ జాతీయ రహదారిని భారత్ నుంచి థాయిలాండ్‌కు మయన్మార్ మీదుగా నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి 2002 ఏప్రిల్ నెలలో భారత్, మయన్మార్, థాయిలాండ్ దేశాలకు చెందిన మంత్రుల స్థాయి సమావేశంలో ఆమోదం తెలిపారు. భారత్ - మయన్మార్ - థాయిలాండ్ త్రైపాక్షిక జాతీయ రహదారి పొడవు 1400 కిలోమీటర్లు. ఈ 1400 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారిని 2019 వరకు పూర్తి చేయాలని అప్పట్లో ప్రతిపాదించారు.
అయితే వివిధ కారణాల వల్ల ఈ జాతీయ రహదారి నిర్మాణం ఆలస్యమైంది. అయితే ఈ జాతీయ రహదారి నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు. త్వరలోనే ఈ జాతీయ రహదారిని పూర్తి చేసి భారత్ నుంచి మయన్మార్ మీదుగా థాయిలాండ్‌కు రోడ్డు మార్గాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ జాతీయ రహదారి పనులు 70 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మరో 3 నుంచి 4 ఏళ్లలో ఈ జాతీయ రహదారి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని గడ్కరీ చెప్పారు. ఈ జాతీయ రహదారి భారత్‌లోని మణిపూర్ రాష్ట్రంలో ఉన్న మోరే నుంచి మయన్మార్ మీదుగా థాయిలాండ్‌లోని మే సోట్ వరకు ఉంటుందని వెల్లడించారు. ఈ త్రైపాక్షిక జాతీయ రహదారికి సంబంధించి మణిపూర్ రాజధాని ఇంఫాన్ నుంచి మోరే వరకు ఉన్న సెక్షన్.. ఈ ఏడాది చివరి వరకు పూర్తి అవుతుందని పేర్కొన్నారు.
భారత్ - మయన్మార్ - థాయిలాండ్ వరకు ఉన్న పూర్తి జాతీయ రహదారి మరో 3 నుంచి 4 ఏళ్లలో పూర్తి అవుతుందని థాయిలాండ్ విదేశీ వ్యవహారాల ఉప మంత్రి విజావత్ ఇస్రభక్తి వెల్లడించారు. థాయిలాండ్ భూభాగంలోని 99 శాతం 4 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే పూర్తి అయిందని.. ఇక భారత్, మయన్మార్ భూభాగాల్లో ఉన్న జాతీయ రహదారిని ఆయా ప్రభుత్వాలు ఎప్పటి వరకు పూర్తి చేస్తాయో.. అంత త్వరగా ప్రాజెక్టు పూర్తి అవుతుందని విజావత్ ఇస్రభక్తి తెలిపారు. ఈ జాతీయ రహదారి పూర్తి అయితే.. దాన్ని మరిన్ని దేశాలకు విస్తరించాలని భారత్ భావిస్తోంది. ఆగ్నేయ ఆసియాతో భారత్‌కు రోడ్డు మార్గాన్ని విస్తరించేందుకు వివిధ దేశాలైన లావోస్, కాంబోడియా, వియత్నాంలకు ఇదే జాతీయ రహదారిని పొడగించాలని యోచిస్తోంది.