ఇటీవలి కాలంలో నిత్యం ఏదో ఒక విమానయాన సంస్థ వార్తల్లో నిలుస్తున్నాయి. ఓ వైపు ప్రయాణికుల ప్రవర్తన.. మరోవైపు.. సంబంధిత ఎయిర్‌లైన్స్ సిబ్బంది చేసే పనులతో తరచూ ఏదో ఒక ఘటన వినిపిస్తూనే ఉంది. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఈసారి అలసిపోయిన పైలట్లు.. విమానాన్ని మధ్యలోనే ల్యాండింగ్ చేశారు. తమ డ్యూటీ టైమ్ అయిపోయిందంటూ విమానాన్ని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అందులోని ప్రయాణికులు గంటల తరబడి అక్కడే చిక్కుకుపోయారు. సంబంధిత విమానయాన సంస్థ నుంచి సరైన స్పందన, సదుపాయాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అనుభవించిన బాధను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరోవైపు.. ఆ విమానంలో ఉన్న తన భార్య ఇంకా రావడం లేదని కంగారు పడిన ఆమె భర్త.. ఆమెతో చేసిన వాట్సాప్ చాట్‌ను సోషల్ మీడియాలో ఉంచడంతో ప్రస్తుతం ఈ ఘటన వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో సంబంధిత విమానయాన సంస్థపై విరుచుకుపడుతున్నారు.
జులై 2 వ తేదీన డెహ్రాడూన్ నుంచి చెన్నైకి ఇండిగో విమానం బయల్దేరింది. మధ్యలో ఆ విమానం లక్నోలో ల్యాండ్ అయింది. ఆ విమానం చెన్నైకి చేరుకోవాల్సి ఉండగా.. దాన్ని ఢిల్లీకి దారి మళ్లించారు. అయితే ఢిల్లీకి వెళ్లేందుకు పైలట్లు నిరాకరించడంతో ఆ విమానం లక్నో ఎయిర్‌పోర్టులో నిలిచిపోయింది. ఢిల్లీలో ప్రతికూల వాతావరణం ఉండటంతో విమానాన్ని జైపూర్‌కు తరలించాలని నిర్ణయించారు. అయితే అప్పటికే పైలట్ల డ్యూటీ టైమింగ్ పూర్తి కావడంతో విమానాన్ని వదిలి పెట్టి వెళ్లారు. మరో పైలట్‌కు సమాచారం అందించినా ఎవరూ రాలేదని ప్రయాణికులు వెల్లడించారు. అయితే విమానంలో ఉన్న ఇండిగో సిబ్బందికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. దీంతో కొన్ని గంటలపాటు అక్కడే నిలిచిపోయిందని తెలిపారు.
అయితే విమానంలో ఉన్న తన భార్య రావడం ఆలస్యం కావడంతో ఆమెతో చేసిన వాట్సాప్ చాట్‌ను సమీర్ మోహన్ అనే వ్యక్తి ట్విటర్ వేదికగా పంచుకుంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పైలట్ తీవ్రంగా అలసిపోయినట్లు ఉన్నాడని.. ఇక అతడు విమానాన్ని నడపలేడని ఆమె చేసిన చాటింగ్‌లో ఉంది. ఈ ట్వీట్‌ను పంచుకున్న సమీర్ మోహన్.. దీనిపై స్పందించాలని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటన ఆపరేషనల్ కారణమని ఇండిగో విమానయాన సంస్థ వెల్లడించింది.
పైలట్లు విమానాన్ని పార్క్ చేసి వెళ్లిపోయారని.. విమానంలోని సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వలేదని.. కేథారినాథ్ కమలనాథన్ అనే మరో ప్రయాణికుడు ట్వీట్ చేశారు. దాదాపు 9 గంటల పాటు విమానంలోనే చిక్కుకుపోయామని.. కనీసం ఆహారం, ఇతర సౌకర్యాలు కూడా అందించలేదని మండిపడ్డారు. ఇంత జరిగినా ఇండిగో సంస్థ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదని ఆరోపించారు. గత వారం రోజుల్లో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. గత ఆదివారం దాదాపు 350 మంది ప్రయాణికులతో లండన్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం.. జైపూర్‌లో 3 గంటలపాటు నిలిచిపోయింది. తన వర్కింగ్ అవర్స్ పూర్తి కావడంతో విమానాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు పైలట్ నిరాకరించడంతో విమానం అక్కడే ఉండిపోయింది.