ఒకే కుటుంబంలో రెండో పింఛను అర్హతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన 'జగనన్న సురక్ష' పేరుతో వాలంటీర్లను ఇంటింటికీ పంపి ఈ వివరాలపై ఆరా తీయిస్తోంది. జగనన్న సురక్ష సర్వేకి సంబంధించి వాలంటీర్లకు ప్రత్యేక యాప్ ఇవ్వగా.. ఇంట్లో రెండో వ్యక్తి ఏ పింఛనుకు అర్హులు? అనే ప్రశ్నను కూడా పొందుపరిచారు. ఆయా ఇళ్లలో వివరాలను సేకరిస్తున్నారు.
ఇప్పటికే ఒక పింఛన్ తీసుకుంటున్న కుటుంబాల్లో రెండో పింఛనుగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగుల పింఛన్, చేనేత పింఛన్, కల్లుగీత కార్మికుల పింఛన్, మత్స్యకార పింఛన్, డప్పు కళాకారులు, చర్మకారులు, హిజ్రాల పింఛన్‌కు ఎవరైనా అర్హులు ఉన్నారా అనే వివరాలను నమోదు చేసుకుంటున్నారు. దీంతో త్వరలో రెండో పింఛన్‌పైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది.
2019 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి ఏడాదిలోనే ఒకే కుటుంబంలో రెండో పింఛన్ నిలిపివేశారు. ప్రభుత్వం ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛను విధానాన్ని అమలు చేసింది. వృద్ధులైనా, వితంతువులైనా, ఒంటరి మహిళలైనా ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు ఉంటే ఒకటి నిలిపేశారు. కాకపోతే ఈ నిబంధన నుంచి దివ్యాంగులను, ఆరోగ్య పింఛన్లను మినహాయించారు. అంతకుముందే ఆ నిబంధన ఉన్నా గత ప్రభుత్వాలు అమలు చేయలేదు.
వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వం రెండో పింఛన్ ఇప్పటి నుంచే అందించాలని భావిస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు మొత్తం 10 రకాల పింఛన్ల అర్హతపై వివరాలు సేకరిస్తున్నారు. రెండో పింఛన్ అందించ్చాలనే ఉద్దేశంతోనే వాలంటీర్లతో ఇలా సర్వే చేయిస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ ఒకే ఇంట్లో రెండో పింఛన్‌ను కనుక అమలు చేస్తే ప్రభుత్వంపైనా అదనపు భారం పడే అవకాశం ఉంది.