ఏపీ బీజేపీ నాయకత్వం మార్పు జరిగింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమిస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం ఈ మధ్యాహ్నం ప్రకటన చేయడం తెలిసిందే. ఇప్పటివరకు ఏపీ బీజేపీ చీఫ్ గా వ్యవహరించిన సోము వీర్రాజు స్థానంలో పురందేశ్వరి బాధ్యతలు స్వీకరిస్తారు. పురందేశ్వరి నియామకంపై సోము వీర్రాజు స్పందించారు. "ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా నియమితులైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వివిధ స్థాయిల్లో పార్టీకి మీరు అందించిన సేవలు, రాజకీయ అనుభవం, రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ఉపయోగపడతాయని ఆకాంక్షిస్తున్నాను" అని తెలిపారు. సోము వీర్రాజు 2020లో ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టారు. కన్నా లక్ష్మీనారాయణ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అందుకున్నారు. ఆ సమయంలో, కన్నా లక్ష్మీనారాయణ తర్వాత ఏపీ బీజేపీ చీఫ్ ఎవరన్న చర్చ వచ్చినప్పుడు పురందేశ్వరి పేరు, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిల పేర్లు కూడా వినిపించాయి. అయితే, బీజేపీ అధిష్ఠానం అప్పట్లో సోము వీర్రాజు వైపు మొగ్గింది.