తన గ్రాఫ్ పడిపోకుండా బీజేజీ దిద్దుబాటు చర్యలకు దిగింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న అధికార భారతీయ జనతా పార్టీ.. పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పలు రాష్ట్ర శాఖల్లో అధ్యక్షులను మార్చింది. అటు.. జాతీయ కార్యవర్గంలో కూడా పలు మార్పులు చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్న పాత అధ్యక్షుల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ప్రకటన విడుదల చేశారు. కొత్తగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుల్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండటం గమనార్హం.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కుమార్‌ను పార్టీ పక్కకు పెట్టింది. ఆయనకు జాతీయ స్థాయిలో సమున్నత పదవి ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకున్నాక.. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడి.. భవిష్యత్‌లో ఇచ్చే పదవులపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బండి సంజయ్ స్థానంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించింది. కిషన్ రెడ్డికి గతంలోనూ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణ ఏర్పాడ్డాక తొలి అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఇక తెలంగాణలో అధికార భారాస నుంచి బీజేపీలో చేరిన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు అందించింది.
అటు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ పార్టీ చీఫ్ మారిపోయారు. ఇప్పటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుకు కూడా బీజేపీ అధినాయకత్వం పదవి నుంచి ఉద్వాసన పలికింది. ఈ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరిని నియమించారు. 2014 ఎన్నికల వేళ బీజేపీలో చేరిన పురంధేశ్వరి.. ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2014 ఎన్నికల తర్వాత బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు అధ్యక్షులను మార్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా మరో రెండు రాష్ట్రాలకు కూడా బీజేపీకి కొత్త అధ్యక్షులు వచ్చారు. జార్ఖండ్ మాజీ సీఎం బాబులాల్ మరాండిని.. ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ అధిష్ఠానం నియమించింది. మరోవైపు.. పంజాబ్ బీజేపీ అధ్యక్షుడిగా సునీల్ జాఖర్‌ను నియమితులయ్యారు.