ఏడాదిన్నరగా తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ను ఆదుకోడానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి ముందుకొచ్చింది. 3 బిలియన్ డాలర్ల స్వల్పకాలిక ఆర్థిక ప్యాకేజీని ఐఎంఎఫ్ శుక్రవారం అందజేసింది. దీంతో దివాలా అంచున పాక్ ఆర్థిక వ్యవస్థకు ఇది ఊపిరిలూదినట్టయ్యింది. ఈ నేపథ్యంలో సోమవారం పాక్ షేర్ మార్కెట్‌లు లాభాల బాటలో పయనించాయి. కేఎస్ఈ ఏకంగా 15 ఏళ్ల తర్వాత మొదటిసారి గరిష్టానికి చేరుకుని, మొదటి ట్రేడింగ్ సెషన్‌లోనే 5.9% లాభపడింది.
ఐఎంఎఫ్‌తో సిబ్బంది స్థాయి ఒప్పందం, 3 బిలియన్ డాలర్లు నిధి ఏర్పాటు ఫలితంగా పెట్టుబడిదారుల్లో విశ్వాసం బాగా పుంజుకుంటోందని పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మంత్రివర్గం సమావేశంలో మాట్లాడుతూ..‘ఈ ఒప్పందం ఆర్థిక వ్యవస్థకు ఊపిరి నింపి, స్థిరమైన స్థిరత్వానికి మార్గంగా నిలిచింది.. పారిశ్రామికవేత్తలు, ఇతర ఉన్నత వర్గాలు కొన్ని త్యాగాలు చేయకతప్పదు.. మనం దీనిని అవకాశంగా మార్చుకోవాలి’ అని స్పష్టం చేశారు.
కేఎస్ఈ 100 ఇండెక్స్ 2,442.06 పాయింట్లు లాభపడి 43,894.7 వద్ద ముగిసింది. జూన్ 24, 2008 (8.6%) తర్వాత ఈ స్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారి. పాయింట్ల పరంగా పెరుగుదల మరింత ముఖ్యమైందని.. కేఎస్ఈ 100 ఇండెక్స్‌లో నేటి లాభం పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చరిత్రలో అత్యధికంగా ఉంటుందని టాప్‌లైన్ సెక్యూరిటీస్ పేర్కొంది.
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కారణంగా ఇంటర్-బ్యాంక్ ట్రేడింగ్ సెలవుల మధ్య పాకిస్థాన్ రూపాయి విలువలో కొద్దిగా కదలిక వచ్చింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 286 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. ఏదేమైనప్పటికీ 2024, 2025లో మెచ్యూర్ అయ్యే పాకిస్థానీ యూరోబాండ్‌లపై మదుపర్లకు ఆసక్తి పెరుగుతోంది. ఐఎంఎఫ్ ఒప్పందం ప్రకారం కార్ల విడిభాగాల దిగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తారనే అంచనాలతో ఆటోమేకర్లు షేర్ల కొనుగోళ్లకు మొగ్గచూపారు. పాకిస్థాన్ సుజుకి మోటార్ కో తో సహా పలు వాహన తయారీదారులు దిగుమతి ఆంక్షలతో సుదీర్ఘకాలంపాటు ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
హోండా అట్లాస్ కార్స్ (పాక్) , సుజుకీ షేర్లు ట్రేడింగ్ 7.5% పెరిగితే... టయోటా కార్లను మార్కెట్ చేస్తున్న ఇండస్ మోటార్ కో 4.2% లాభపడింది. ఆటో రంగంలో షేర్లు చౌక విలువలతో ట్రేడవుతున్నాయని ఆరిఫ్ హబీబ్ లిమిటెడ్ విశ్లేషకుడు ముహమ్మద్ ఇక్బాల్ జవైద్ అన్నారు. ‘దిగుమతులపై నిషేధం ఎత్తివేయడం.. మూడు బిలియన్ డాలర్లు ఐఎంఎఫ్ డీల్ సురక్షితం కావడంతో సుజుకీ మోటార్స్, హోండా వంటి కంపెనీలు సంబంధిత సరఫరా గొలుసులలో ఎటువంటి సమస్యలు ఉండవు.. వాహనాలకు అవసరమైన అన్ని విడి భాగాలు సమయానికి అందుబాటులో ఉంటాయి ’ అని చెప్పారు.