విమానంలో తన సీటు కింద పరిచిన కార్పెట్ పూర్తిగా రక్తంతో తడిచి ఉండటం చూసి ప్రయాణికుడు షాకయ్యాడు. దీనిని గమనించకుండా అక్కడ పెట్టిన అతడి బ్యాగు, చేతులకు రక్తపు మరకలు అంటుకున్నాయి. ఫ్రాన్స్-టొరంటో ఎయిర్‌ఫ్రాన్స్ విమానంలో చోటుచేసుకున్న ఈ భయానక ఘటనకు సంబంధించిన వివరాలను బాధితుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. హబీబ్ బాటాహ్ అనే వ్యక్తి టొరంటో వెళ్లేందుకు పారిస్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎయిర్‌ఫ్రాన్స్ విమానం ఎక్కాడు. తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నప్పటి నుంచి ఒక రకమైన వాసన వస్తుండటంతో సీటు కింద పరిశీలించాడు.
అక్కడ పరిచిన కార్పెట్‌పై తడిగా ఉన్న ఓ పెద్ద మరక కనిపించడంతో క్యాబిన్ సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. వాళ్లు టిష్యూ పేపర్లు ఇచ్చారు. దీంతో టిష్యూలతో ఆ మరకను తుడిచి చూడగా.. అదంతా రక్తమని గ్రహించి ఖంగుతిన్నాడు. పదుల కొద్ది టిష్యూలతో తుడిచినా.. అలాగే ఉండటంతో సీటు కింద పెట్టిన బ్యాగుకూ రక్తపు మరకలు అంటుకున్నాయి. కొద్దిసేపటికి సిబ్బంది అసలు విషయం బయటపెట్టారు. అంతకుముందు ట్రిప్‌లో ఓ ఇన్‌ఫెక్షన్ రోగి ఈ విమానంలో ప్రయాణించాడని, అతడికి రక్తస్రావమైందని చావు కబురు చల్లగా చెప్పారు. సీట్లను శుభ్రం చేసిన క్లీనింగ్ సిబ్బంది.. కార్పెట్‌ను అలాగే వదిలేశారన్నారు. ఊహించని ఈ సమాధానానికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ బాధితుడు తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నాడు.
‘నేను సీటు కింద నుంచి నా వీపున తగిలించుకునే బ్యాగను బయటకు తీశాను.. దాని పట్టీ కూడా రక్తంలో తడిసిపోయింది. చేతులు, మోకాళ్లపై ఉంచి అరగంట శుభ్రం చేశాను. (ఎయిర్ ఫ్రాన్స్) సిబ్బంది నాకు గ్లౌజులు, టిష్యూలు ఇచ్చారు.. ముందు ట్రిప్‌లో ఒక ప్రయాణికుడికి రక్తస్రావం అయినట్లు గుర్తించారు’ అని తెలిపాడు. ‘నా జీవితంలో ఇప్పటివరకు ఎదురైన ఘటనల్లో ఇది భయానమైంది.. ఇంత రక్తం పోయిన ఆ రోగి పరిస్థితి ఎలా ఉందో? ఒకవేళ అతడికి ఉన్న వ్యాధి తనతోపాటు ఇతర ప్రయాణికులకు సోకితే పరిస్థితి ఏంటి? ఎయిర్‌ఫ్రాన్స్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్‌లు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలి.. ఆ రోగి ప్రస్తుత పరిస్థితిపై సమాచారం అందజేయాలి’ అని హబీబ్ డిమాండ్ చేశాడు.
మరోవైపు, ఈ ఘటన ఎయిర్‌ఫ్రాన్స్ స్పందించింది. ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరిన ఆ సంస్థ.. తమ సిబ్బంది త్వరలోనే సంప్రదిస్తారని తెలిపింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని, ప్రయాణికులనే శుభ్రం చేసుకోమని చెప్పడం ఏంటని మండిపడుతున్నారు.