కంపెనీ తన సిబ్బందికి ఏమైన పనీస్మెంట్ ఇవ్వాలంటే బోనస్ ఆపడమో, ఇంక్రీమోంట్ కట్ చేయడమో చేస్తారు. ఇదిలావుంటే కార్పొరేట్ ప్రపంచంలో వ్యక్తులు, కంపెనీల మధ్య రోజు రోజుకూ పోటీ పెరుగుతోంది. ఈ క్రమంలోనే పోటీని తట్టుకుని.. నంబర్ వన్‌గా నిలవాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే ఇది కాస్త రోజు రోజుకూ మితి మీరిపోతోంది. ఈ పరిస్థితి ప్రైవేటు కంపెనీల్లో మరింత కఠినంగా ఉంటుంది. ఉద్యోగులకు ఇచ్చిన పని పూర్తి చేసేవరకు వారిపై ఆయా సంస్థలు ఒత్తిడి పెంచుతూనే ఉంటాయి. దీంతో ఆ ఉద్యోగులు కూర్చున్న కుర్చీలో నుంచి లేవకుండా.. పని చేస్తూనే ఉంటారు. తాజాగా చైనాలోని ఓ కంపెనీ చేసిన పనికి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆ కంపెనీ ఏం చేసిందంటే.
సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు అంటేనే పని ఒత్తిడి, టార్గెట్లు, షిఫ్టులు ఉంటాయి. అయితే ఉద్యోగులకు ఇచ్చిన టార్గెట్ల విషయంలో యాజమాన్యాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇచ్చిన పనిని కేటాయించిన సమయంలోపు పూర్తి చేయాల్సిందేనని కరాఖండిగా చెబుతూ ఉంటాయి. అయితే చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఉన్న ఓ కార్పొరేట్ కంపెనీ.. టార్గెట్ పూర్తి చేయని తమ ఉద్యోగులకు విచిత్రమైన శిక్ష విధించింది. పచ్చి కాకరకాయలను తీసుకువచ్చి.. ఇచ్చిన సమయంలో టార్గెట్ పూర్తి చేయని ఉద్యోగులతో తినిపించింది. అటు పని పూర్తి చేయలేక.. ఇటు ఆ పచ్చి కాకరకాయలను తినలేక ఆ కంపెనీ ఉద్యోగులు అయోమయంలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ ఉద్యోగి వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో అది కాస్త వైరల్‌గా మారింది.
ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోను జాంగ్ అనే ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కంపెనీ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. కష్టపడి పనిచేసే ఉద్యోగులపై సదరు సంస్థ ఈ విధంగా కాకరకాయలు తినిపించడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. సంస్థ ఎదుగుదలకు నిరంతరం తోడ్పాటు అందిస్తున్న ఉద్యోగుల పట్ల.. కంపెనీ యాజమాన్యం ప్రవర్తించిన తీరు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడుతున్నారు. ఉద్యోగులను మంచిగా చూసుకుంటే వారు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు కానీ.. ఇలా శిక్షిస్తే మరింత కుంగిపోతారని కొంత మంది నెటిజన్లు అంటున్నారు.
ఇది కంపెనీ రివార్డ్ అండ్ పనిష్‌మెంట్ విధానంలో భాగమని చెబుతోంది. ఉద్యోగులు జాబ్‌లో చేరడానికి ముందే ఇలాంటి వాటికి అంగీకరించారని కంపెనీ యాజమాన్యం పేర్కొంది. ఉద్యోగులకు పని ఇచ్చి.. దాన్ని పూర్తి చేసేందుకు తగిన సమయం ఇచ్చామని.. అయినప్పటికీ వారు పూర్తి చేయలేదని తెలిపింది. అందుకే ఇలాంటి శిక్ష విధించినట్లు వెల్లడించింది. అయితే ఇటీవలి కాలంలో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చిన టార్గెట్స్‌ను పూర్తి చేయకపోవడంతో వారిని ఉద్యోగాల నుంచి తీసివేస్తున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత కూడా విధిస్తున్నాయి.