ఆఫ్ఘనిస్తాన్ సర్కార్ మరో కఠిన నిర్ణయం తీసుకొంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన ఎలా సాగుతుందో ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేపట్టిన తాలిబన్లు.. రెండేళ్లుగా పాలన కొనసాగిస్తున్నారు. అయితే తాము గతంలో చేసిన పాలన కాకుండా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని.. అధికారం చేపట్టిన మొదట్లో తాలిబన్లు ప్రకటించారు. అయితే వారు చెప్పిన దానికి.. చేస్తున్న పనులకు ఎలాంటి సంబంధం లేకుండా పోతోంది. ముఖ్యంగా మహిళలపై వారి ఆకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలు చదువుకోవడం దగ్గర నుంచి ఉద్యోగాలు చేయడం వరకు అడుగడుగునా నిషేధాలు విధిస్తూనే ఉన్నారు. గతంలో చేసిన పాలననే గుర్తుకు తెస్తున్నారు. తాజాగా మహిళలు నడిపే బ్యూటీ సెలూన్లపైనా నిషేధం విధించారు.
తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టినప్పటికీ.. ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహిళల బ్యూటీ సెలూన్‌లపై తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించింది. రాజధాని కాబూల్ సహా ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న అన్ని ప్రావిన్సులలో మహిళల బ్యూటీ సెలూన్‌లపై ఆంక్షలు ప్రవేశ పెట్టింది. ఇప్పటి నుంచి మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని.. అందులో పనిచేయకూడదని తాలిబన్ ప్రభుత్వంలోని మంత్రి మహ్మద్ అకిఫ్ మహజర్ కొత్త ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు కాబుల్ మున్సిపాలిటీకి ఆదేశాలు ఇచ్చారు.
తాలిబన్లు తీసుకున్న తాజా నిర్ణయంతో ఆఫ్ఘనిస్థాన్‌లోని మేకప్ ఆర్టిస్టులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో చాలా మంది పురుషులకు ఉద్యోగాలు లేవని.. దీంతో కుటుంబ పోషణ చాలా భారంగా మారిందని పేర్కొంటున్నారు. దీంతో అనివార్య పరిస్థితుల్లో మహిళలు బయటకు వచ్చి ఉద్యోగాలు, పనులు చేయాల్సి వస్తోందని తెలిపారు. ఇప్పుడు మహిళలపై అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారని.. తాజాగా సెలూన్లపై నిషేధం విధిస్తే తాము ఏ పని చేసి బతకాలని ప్రశ్నిస్తున్నారు. కొత్త కొత్త ఆంక్షలతో ఉపాధి లేక తామంతా చనిపోవాలని తాలిబన్ ప్రభుత్వం కోరుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మహిళలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో రోడ్లపైకి వచ్చి తమ ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు.
తాలిబన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశాన్ని నాశనం చేసే విధంగా ఉన్నాయని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అఫ్గాన్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న తాలిబన్లు.. మహిళల హక్కులను కాలరాస్తున్నారంటూ ప్రపంచదేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి. చట్టబద్దమైన పాలన అందించకపోతే ఆఫ్ఘనిస్థాన్‌పై ఆంక్షలు మరింత కఠినతరం చేస్తామని ఇప్పటికే ఎన్నో దేశాలు హెచ్చరిస్తున్నాయి. అయినప్పటికీ తాలిబన్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో బాలికలు, మహిళలపై ఎన్నో రకాల ఆంక్షలు విధించారు. బాలికల చదువుపై పరిమితులు విధించింది. సినిమాలు చూడవద్దని, ఒంటరిగా బయట తిరగవద్దని, పార్కులు, జిమ్‌లకు వెళ్లవద్దని నిబంధనలు తీసుకువచ్చారు.