కాకినాడ, ఉప్పాడ తీరంలో శుక్రవారం తెల్లవారుజామునుంచి సముద్రం అల్లకల్లోలంగా మారింది. బీచ్‌రోడ్డు మీదుగా కాకినాడ పరిసర ప్రాంతాలకు బైక్‌లపై వెళ్లే ప్రయాణికులు కెరటాల ధాటికి హడలెత్తిపోతున్నారు. విద్యుత్ ప్లాంటు సమీపంలో శిథిలమైన పెద్దవంతెన స్థానే నిర్మించిన అప్రోచ్ వంతెన పైనుంచి కెరటాలు అవతలివైపునకు పోతున్నాయి. నేమాం సమీపంలో కెరటాలు బలంగా తాకడంతో బీచ్ రోడ్డు కోతకు గురైంది. అమీనాబాద్ రేవు నుంచి శుక్రవారం వేటకు బయలుదేరిన మత్స్యకారుల బోటు హార్బర్ మొగలో నిర్మించిన గోడల కారణంగా తిరగబడింది. మత్స్యకారులు సముద్రంలో దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. రాకాసి అలల కారణంగా ఉప్పాడ-కాకినాడ బీచ్‌రోడ్డులో వాహనాల రాకపోకలను నియంత్రించారు.