తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. చీనీ తోటకు పంట భీమా డబ్బులను ఎమ్మెల్యే కేతిరెడ్డి కొట్టాశారని జేసీ ఆరోపించారు. ఎమ్మెల్యే చీనీ తోటను పరిశీలించడానికి వస్తానంటూ జేసీ సవాల్ విసిరారు. ఈ క్రమంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనీ మొక్కలు నాటిన ఏడాదికే రూ. 13.89 లక్షల పరిహారం అందిందని జేసీ ఆరోపణలు గుప్పించారు. ఇందులో భాగంగా పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే చీనీ తోటను పరిశీలించడానికి వెళ్లాలని జేసీ నిర్ణయించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు బలగాలు మోహరించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.