గ్రామ/వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసిందో లేదో వివరాలు సమర్పించాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు, కొందరు మహిళా కార్యదర్శులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఎంఎస్‌కేల పేరుతో గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు పిటిషనర్లను రిక్రూట్‌చేశారని.. మహిళా శిశు సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్న వీరిని పోలీసు శాఖకు జత చేస్తూ మహిళా పోలీసుగా పేరుమార్చారని తెలిపారు. ఖాకీ డ్రెస్ వేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని.. సాధారణ పోలీసుల మాదిరిగా బందోబస్తు, నైట్ డ్యూటీలు వేస్తున్నారని వెల్లడించారు. గ్రామ/వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కాలపరిమితి జూన్ 7 తోనే ముగిసిందన్నారు. అది చట్టంగా రూపుదాల్చలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఆర్డినెన్స్ కాలపరిమితి ముగిసిందో లేదో వివరాలు సమర్పించాలని జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తమను మహిళా పోలీసులుగా కొనసాగించాలని, వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని కొందరు మహిళా కార్యదర్శులు వేసిన అనుబంధ పిటిషన్లను అనుమతించింది. విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.