కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యునివర్సిటీ అధికారులు 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ఇంటర్యూల ప్రిక్రియను హైకోర్టు నిలుపుదల చేసింది. ఇంటర్వ్యూల నిర్వహణ కోసం జూన్ 30న ఇచ్చిన ప్రకటనను సస్పెండ్ చేసింది. ఈ ప్రకటన ఆధారంగా ముందుకు వెళ్లవద్దని అధికారులకు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి, అంబేడ్కర్ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌లకు నోటీసులు జారీ చేసింది. విచారణను 4వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యునివర్సిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న పలువురిని విధుల నుంచి తొలగిస్తూ రిజిస్ట్రార్ జూన్ 30న ఉత్తర్వులు ఇచ్చారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ఈ నెల 10, 11వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు అదేరోజు పత్రికా ప్రకటన ఇచ్చారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ. గణేశ్‌బాబు, మరో 10మంది హైకోర్టును ఆశ్రయించారు.