ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. సీఎం జగన్ పేదల పక్షపాతినని చెబుతారని.. కానీ, వారిపైనే కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పక్షపాతినని చెప్పుకుంటూ వారిపైనే కక్షగట్టినట్లు వ్యవహరిస్తున్నారని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. లోకేష్ యువగళం పాదయాత్ర 150వ రోజు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలో జరిగింది. ఉడిపిగుంట, ఊదురుగుంట, ఎర్రప్పగుంట గ్రామస్థులు లోకేష్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామీణాభివృద్ధి పూర్తిగా పడకేసిందని చెప్పారు. గ్రామ సీమలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పంచాయతీల అభివృద్ధికి ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన రూ. 8,660 కోట్ల నిధులను దారి మళ్లించారని ఆరోపించారు.
ఈ సందర్భంగా ఉప్పు రైతులతో సమావేశమైన నారా లోకేష్ వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్ పరిపాలన వచ్చిన తర్వాత ఉప్పు సాగు చేస్తున్న రైతులకు కనీస సాయం అందడం లేదన్నారు. పండించిన ప్రతి పంటకు బీమా ఉంది కానీ, ఉప్పుకి మాత్రం లేదని పేర్కొన్నారు. 150వ రోజు పాదయాత్రలో ఉప్పు రైతులతో సమావేశం పెట్టుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.