వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రుషికొండ బీచ్‌కు వెళ్లే వారికి ఎంట్రీ ఫీజు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో రుషికొండ బీచ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంట్రీ టికెట్లు పెట్టడంపై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వంపై శనివారం ఆయన ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో తాకట్టు పెట్టాలనుకున్నవన్నీ పెట్టేశారని.. అమ్మాలని అనుకున్నవన్నీ అమ్మేశారని.. కూల్చాలి అనుకున్నవన్నీ కూల్చేశారని.. వేయాలనుకున్న పన్నులన్నీ వేసేశారని విమర్శించారు. ఇప్పుడేమో బీచ్‌ల వద్ద పార్కింగ్ ఫీజులు, ఎంట్రీ ఫీజులు పెట్టారని గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, విశాఖపట్నం అంటే అందమైన బీచ్‌లు గుర్తొస్తాయని.. సముద్ర తీరంలో కాసేపు సేదదీరితే ఒత్తిడి తగ్గుతుందని విశాఖపట్నం వాసులు సాయంత్రం అలా బీచ్‌కు వెళ్తుంటారని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇకపై ‘బ్లూ’ ఫాగ్‌గా గుర్తింపు ఉన్న రుషికొండ బీచ్‌కు వెళ్లాలంటే 20 రూపాయలు ఎంట్రీ ఫీజు పెట్టడంతో ప్రకృతి ప్రేమికుల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీచ్‌ల వద్ద పార్కింగ్ ఫీజు కింద ద్విచక్ర వాహనాలకు రూ. 10, కార్లకు రూ. 30, బస్సులకు రూ. 50 వసూలు చేస్తున్నారని విమర్శించారు.
ఇప్పుడేమో బీచ్‌లోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు పెట్టారని గంటా శ్రీనివాసరావు పెరిగారు. సముద్ర తీరం అందాలు ఆస్వాదించడానికి ప్రభుత్వమే అధునాతన హంగులతో బీచ్‌లను అభివృద్ధి చేసి పర్యాటకులను, నగర వాసులను ఆకట్టుకోవాల్సింది పోయి.. ఎంట్రీ ఫీజులు పెట్టి పర్యాటకుల నడ్డి విరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంట్రీ టికెట్లపై వెంటనే పునరాలోచన చేయాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.