ఉత్తరప్రదేశ్ లో ఓ దళిత యువకుడిపై దాడి చేసి, బలవంతంగా చెప్పులను నాకించారు. ఆపై గుంజీలు తీయిస్తూ మాటల దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంచంపై కూర్చున్న ఓ వ్యక్తి తన కాలి చెప్పులను రాజేంద్ర అనే దళిత యువకుడితో నాకించడం కనిపిస్తోంది. ఆపై బాధితుడు చెవులు పట్టుకుని గుంజీలు తీయడం చూడొచ్చు. అదే సమయంలో నిందితుడు తిడుతూ బెదిరించడం కనిపిస్తోంది.
వీడియో పోలీసుల దాకా చేరడంతో వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. వీడియోను పరిశీలించి నిందితుడిని తేజ్ పాల్ సింగ్ గా గుర్తించారు. విద్యుత్ శాఖలో లైన్ మెన్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు తేజ్ పాల్ సింగ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.
మధ్యప్రదేశ్ లో ఇటీవల ఓ గిరిజనుడి ముఖంపై అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ లోనే మరో ఘటన చోటుచేసుకుంది. దళితుడితో పాటు మరో యువకుడిపై మైనారిటీ వర్గానికి చెందిన కుటుంబం దాడి చేసింది. మలం తినిపించి, మెడలో చెప్పుల దండ వేసి, ముఖానికి నలుపు రంగు పూసి ఊరేగించింది. శనివారం మరో యువకుడిపై దాడి జరిగింది. కారులో తీసుకెళుతూ ముఖంపై దాడి చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.