కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్దం అవుతోంది. ఈ నెల 12న లేదంటే 18న మంత్రివర్గ ప్రక్షాళన ఖాయమని తెలుస్తోంది. ఈ వారంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేసారు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కేబినెట్ లో స్థానం ఉంటుందని చెబుతున్నారు.పునర్వ్యవస్థీకరణ కు రంగం సిద్దం: ఈ వారంలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగటం ఖాయంగా కనిపిస్తోంది. -14 తేదీల్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నందున.. ఆలోపే మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు అంచ నా వేస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పగించాలన్న విషయంపై కసరత్తు పూర్తయింది.
వచ్చే వారం గవర్నర్లు, ముఖ్యమంత్రుల మార్పులకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. పలువురు మంత్రులకు వారి రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించటంతో కొత్త మంత్రులతో పునర్వ్యవస్థీకరణ ఖాయంగా మారింది. ఈ నెల 12నే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఉందని పార్టీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు.
పలువరు మంత్రులు ఔట్: ఈ వారంలో సాధ్యపడకపోతే..పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు అవకాశం లేదు. దీంతీ, ఈ వారంలోనే పూర్తి చేస్తారనే ప్రచారం బీజేపీ నాయకత్వం భావిస్తోంది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్ రాం మేఘ్వాల్, భూపేంద్రయాదవ్, గజేంద్రసింగ్ షెఖావత్, ఎస్పీఎస్ బఘేల్, ప్రహ్లాద్ జోషితదితరులు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ తో సమావేశమయ్యారు.
వీరిని పార్టీ సేవలకు వినియోగించుకుంటారని తెలుస్తోంది. ఆ తర్వాత ప్రహ్లాద్ జోషి, భూపేంద్ర యాదవ్‌లకు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. 2021 జూలై7 తర్వాత మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించలేదు. అయిదు రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. 2024కి తన డ్రీం టీంను ఇప్పటికే మోదీ సిద్దం చేసుకున్నట్లు సమాచారం.తెలుగు రాష్ట్రాల నుంచి: తెలుగు రాష్ట్రాల నుంచి కేబినెట్ లో స్థానాల పైన అంచనాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ నుంచి బండి సంజయ్ కు కేబినెట్ లో స్థానం ఖాయమనే ప్రచారం సాగుతోంది. బండి తనకు మంత్రి పదవి వద్దని, కార్యకర్తగానే కొనసాగుతానని పార్టీ ముఖ్య నేతలకు స్పష్టం చేసారు.అయితే, బండికి కేబినెట్ బెర్తు ఖాయమని..మంత్రి పదవి వద్దనే నిర్ణయానికే కట్టుబడి ఉంటే రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీ నుంచి జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్ పేర్లు రేసులో ఉన్నాయి. అదే సమయంలో అనూహ్యంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు పైకి వచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రివర్గంలో చివరకు ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.