మణిపూర్‌లో హింసపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతి భద్రతలను కాపాడటం అనేది ఎన్నికైన ప్రభుత్వ విధి అని స్పష్టం చేసింది. తమకు విశేష అధికారులు ఉన్నా...ప్రభుత్వం చేపట్టే చర్యలను పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. తమను హింస మరింత పెంచే వేదికగా తనను వాడుకోవద్దని ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సూచించింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలను తాము పర్యవేక్షిస్తామని, అవసరమైతే తగిన ఆదేశాలను జారీ చేస్తామని, అంతేగానీ భద్రతా యంత్రాంగాన్ని తాము నడపలేమని ఉద్ఘాటించింది. మణిపూర్‌లో హింసను కట్టడి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ మణిపూర్ ప్రభుత్వం ఓ నివేదికను సమర్పించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఈ అంశంపై చాలా సున్నితంగా వ్యవహరించాలని, తప్పుడు సమాచారం ఇస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని పిటిషనర్లను కోరారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కొలిన్ గొంజాల్వెస్ వాదనలు వినిపించారు. మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయని, గట్టి సూచనలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా గొంజాల్వెస్‌ను ఉద్దేశించి జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, ‘‘శాంతిభద్రతలను మేం స్వాధీనం చేసుకునేలా మీ సంశయవాదం చేయజాలరు’’ అన్నారు. దీనికి గొంజాల్వెస్ స్పందిస్తూ, మణిపూర్‌లో గిరిజనులకు వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఈ వ్యాఖ్యలకు చంద్రచూడ్ బదులిస్తూ, ‘‘రాష్ట్రంలో ఉన్న హింస, ఇతర సమస్యలను మరింత పెంచడం కోసం వేదికగా ఈ ప్రొసీడింగ్‌ను వాడుకోకూడదు.. శాంతి భద్రతలను మేం నడపలేం.. సలహాలేమైనా ఇస్తే స్వీకరిస్తాం’’ అన్నారు. ఇది మానవతా సంక్షోభానికి సంబంధించిన సమస్య అని, దీనిని పార్టీలకు సంబంధించిన అంశంగా చూడవద్దని హితవు పలికారు. ‘‘మీ మనోభావాలను అర్థం చేసుకున్నాం, అయితే ఈ న్యాయస్థానంలో వాదించడానికి కొన్ని పద్ధతులు ఉండాలి’’ అన్నారు.
నిత్యావసర సరుకులకు కీలకమైన 10 కి.మీ హైవే విస్తీర్ణం స్పష్టంగా ఉండేలా చూడాలని మణిపూర్ హైకోర్టు బార్ అసోసియేషన్ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు కోరింది. కాగా, మణిపూర్‌లో మైతీ (Meitei) తెగ తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ కుకీ (Kuki), తదితర గిరిజన జాతులు మే 3 నుంచి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నాయి.
ఇరు వర్గాల ఆందోళనలతో మణిపూర్‌లో హింస భగ్గుమంది. ఈ ఘటనల్లో ఇప్పటి వరకూ 150 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వెస్ట్ కాంగ్పొక్పి ప్రాంతంలో రాత్రికి రాత్రి జరిగిన ఘర్షణలో సోమవారం ఓ పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు, పది మంది గాయపడ్డారు.