జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆగస్టు 2 నుంచి రోజువారీ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. అయితే, ఈ పిటిషన్ల నుంచి తాము వైదొలగుతున్నట్టు ఐఏఎస్ అధికారి షా ఫైసల్ , జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేత షెహ్లా రషీద్ షోరా కోర్టుకు తెలియజేశారు. దీంతో ఇద్దరూ పిటిషన్ల ఉపసంహరణకు రాజ్యాంగ ధర్మాసనం అనుమతించింది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రవేశ పరీక్ష 2009లో టాపర్‌గా నిలిచిన షా ఫైసల్.. జమ్మూ కశ్మీర్ నుంచి ఈ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. కుప్వారా జిల్లాలోని లొలాబ్ వ్యాలీ షా ఫైసల్ స్వస్థలం. శిక్షణ తర్వాత పలు ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వర్తించిన ఫైసల్.. కశ్మీర్‌లో మారణహోమానికి నిరసనగా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. భారతీయ ముస్లింలను కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ‘జమ్మూ అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్‌మెంట్’ పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు.
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం వైస్-ప్రెసిడెంట్‌గా పనిచేసి షెహ్లా రషీద్ షోరా.. ఉద్యమాలు, ఆందోళనల్లో చురుకుగా పాల్గొన్నారు. 2016లో దేశ ద్రోహం కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్ వంటి విద్యార్థి నేతల అరెస్ట్‌లను నిరసిస్తూ వారిని విడుదల చేయాలని పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేపట్టారు. అనంతరం ఆమె ఫైసల్ పార్టీలో చేరారు.
2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ఫైసల్ సహా పలువురు నేతలను కేంద్రం అదుపులోకి తీసుకుంది. అయితే, ఆ సమయంలోనే ఫైసల్ విజ్ఞప్తితో పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. షోరా కూడా ఆ పార్టీని వీడారు. తనను తిరిగి సర్వీసుల్లోకి తీసుకోవాలని కోరుతూ రాజీనామా ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్రానికి ఫైసల్ అర్జీ పెట్టుకున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. అతడ్ని మళ్లీ విధుల్లోకి తీసుకుంది. ఇటీవల ట్విట్టర్‌లో ఆర్టికల్ 370 గురించి ‘అది గతించిపోయిన అంశం’ అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు. ‘ఆర్టికల్ 370 అనేది నాలాంటి కశ్మీరీలకు ఇది గతం.. జీలం, గంగ గొప్పగా హిందూ మహాసముద్రంలో కలిసిపోయాయి.. వెనక్కి వెళ్లేది లేదు. ముందుకు సాగడం మాత్రమే ఉంది’ అని ఐఏఎస్ ట్విట్టర్2లో పేర్కొన్నారు.