దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ - ఈడీ చీఫ్ పదవీ కాలం పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈడీ చీఫ్ పదవీ కాలాన్ని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అనేది 2021 లో ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తుందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో ప్రస్తుతం ఈడీ చీఫ్‌గా ఉన్న సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలం పెంపు అనేది చట్ట విరుద్ధమని పేర్కొంది. అయితే ఈడీ చీఫ్ పదవిలో జులై 31 వ తేదీ వరకు సంజయ్ కుమార్ మిశ్రాను ఉండేందుకు అనుమతించిన కోర్టు.. అప్పటి వరకు ఆ దర్యాప్తు సంస్థకు మరో వ్యక్తిని నియమించాలని కేంద్రానికి సూచించింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రాను 2018 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే సంజయ్ కుమార్ మిశ్రా వయస్సు 2020 నవంబర్ నాటికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో ఆయన అప్పటికి పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈడీ చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని పొడగించింది.
అయితే ఈడీ చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలం పొడగింపు చట్ట విరుద్ధమని తేల్చిన సుప్రీంకోర్టు.. వెంటనే ఆ పదవి నుంచి ఆయనను తొలగించాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు ఒక విషయాన్ని విన్నవించింది. అయితే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ - ఎఫ్ఏటీఎఫ్ నిర్వహిస్తున్న పీర్ రివ్యూ మధ్యలో ఉన్నందున ఇలాంటి పరిస్థితుల్లో ఈడీ చీఫ్‌ను మార్చడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఈడీ చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రా జూలై 31 వరకు కొనసాగుతారని సుప్రీం కోర్టు తెలిపింది. అప్పటి వరకు ఆ పదవికి మరో వ్యక్తిని ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం సూచించింది.