వరుణడి ప్రకోపానికి ఉత్తర భారతం విలవిల్లాడుతోంది. గత నాలుగు రోజులుగా ఆకాశం చిల్లులు పడిందా అన్నట్లు కురుస్తున్న వానలతో పలు రాష్ట్రాల్లో అపార నష్టం వాటిల్లింది. దేశ రాజధాని ఢిల్లీ తో పాటు హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరాదిలో వర్షాల కారణంగా ఇప్పటివరకు మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్‌ప్రదేశ్ లో అత్యధికంగా 17 మంది మృతిచెందారు. దాదాపు 300 మంది ప్రజలు వేర్వేరు చోట్ల వరద నీటిలో చిక్కుకున్నారు. నగరాలు, పట్టణాల్లో మోకాలిలోతున వరదనీరు, మురుగునీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పలుచోట్ల రోడ్లు తెగిపోగా.. వాహనాలతో పాటు కొన్ని భవనాలు నీటిలో కొట్టుకుపోయాయి. మరో రెండు రోజుల పాటు పలు రాష్ట్రాలకు భారీ వరద ముప్పు ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. పశ్చిమ గాలులు, రుతుపవనాలు కలిసిపోవడంతోనే ఇలా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. పంజాబ్‌లో విద్యాసంస్థలకు ఈ నెల 13 వరకు సెలవులు ప్రకటించారు. యమునానది ప్రమాద స్థాయి (205.33 మీటర్లు)ని మించి ప్రవహిస్తుండటంతో హరియాణ, ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నది ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. కులులో లారీలు, బండ రాళ్లు, పెద్దపెద్ద దుంగలు వరదలో కొట్టుకుపోయాయి. కులు- మనాలీలో భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వందేళ్ల నాటి పురాతన వంతెన వరద తీవ్రతకు కొట్టుకుపోయింది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ ఆదివారం అర్ధరాత్రి సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టి నదిలో చిక్కుకున్న ఆరుగురిని కాపాడింది. 10 జిల్లాలకు రెడ్‌అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు. శిమ్లా-కల్కా మార్గంలో రైళ్లు, వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు. గత 50 ఏళ్లలో ఇలాంటి భారీ వర్షాలను తాము ఎన్నడూ చూడలేదని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కూ అన్నారు. వర్షాల కారణంగా ఇప్పటివరకు రూ.3వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు ఆయన వెల్లడించారు.
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ వద్ద నదీ ప్రవాహంలో ఓ బస్సు చిక్కుకుపోగా... స్థానికుల సాయంతో ప్రయాణికులు కిటికీల నుంచి బయటపడి ప్రాణాలను కాపాడుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని లేహ్‌లో వర్షాల ధాటికి 450 ఏళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలింది. లడఖ్‌లో 24 గంటల రెడ్ అలర్ట్ ప్రకటించారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూడు రోజుల నుంచి మూసేశారు. పంజాబ్‌లో కొన్నిచోట్ల వరదలు సంభవించాయి. పటియాలా జిల్లాలో వరదల బీభత్సం దృష్ట్యా సైన్యాన్ని రంగంలో దించారు. రాజస్థాన్‌లోనూ వర్షాలు ముంచెత్తాయి. మౌంట్ అబూలో 24 గంటలల్లో రికార్డుస్థాయిలో 231 మి.మీ. వర్షపాతం నమోదైంది.