దక్షిణ అమెరికాలోని చిలీ దేశాన్ని ఇప్పుడు కొత్త వైరస్ ఒకటి తీవ్రంగా కలవర పెడుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ సోకిన వారికి నరాలు పనిచేయకుండా.. మొత్తం కండరాల వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. ఇది పక్షవాతానికి కూడా దారితీస్తుందని వైద్య నిపుణులు గుర్తించారు. అయితే దీనికి ఇప్పటివరకు చికిత్స లేకపోవడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఏం చేయాలో పాలు పోని చిలీ సర్కార్.. 3 నెలలు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
గిలాన్ బరే సిండ్రోమ్ - జీబీఎస్ అనే అత్యంత అరుదైన సిండ్రోమ్ ఇది. ఈ కొత్త వింత వ్యాధితో చిలీవాసులు తీవ్రంగా అల్లాడి పోతున్నారు. ఈ కొత్త వైరస్ ఒంట్లోని వ్యాధి నిరోధక శక్తి, నరాల వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుందని గుర్తించారు. దీని కారణంగా శరీరంలోని కండరాల వ్యవస్థ పూర్తిగా నిర్విర్యం అవుతుందని దాని వల్ల.. విపరీతమైన అలసట, సత్తువ లేకపోవడం, ఒంట్లోని అవయవాలు మొద్దుబారడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వైరస్ మొదట కాళ్లలో ప్రారంభమై.. క్రమంగా పైకి వ్యాపిస్తూ.. శరీరం మొత్తం చేరుతుందని గుర్తించారు. ఈ గిలాన్ బరే సిండ్రోమ్ బాగా ఎక్కువ అయితే పక్షవాతానికి దారి తీస్తుందని జిన్ హువా అనే వార్తా సంస్థ వెల్లడించింది. పెద్దవారిలో ముఖ్యంగా మగవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తోందని తెలిపింది. అయితే అన్ని వయసుల వారికి కూడా ప్రమాదమేనని పేర్కొంది.
అయితే ఈ గిలాన్ బరే సిండ్రోమ్ ఎందుకు సోకుతుంది అనే దానికి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే ఎక్కువగా ఇన్ఫెక్షన్లు సోకడం ముఖ్యంగా కాంపిలోబాక్టర్ జెజునీ అనే బ్యాక్టీరియా ఈ వైరస్ రావడానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. దీంతోపాటు ఇన్‌ఫ్లుయెంజా, సైటోమెగలూ, ఎప్‌స్టెయిన్‌బర్‌తో పాటు కొవిడ్ వైరస్ కారణంగా కూడా ఈ గిలాన్ బరే సిండ్రోమ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ జీబీఎస్‌ను నిర్ధారించేందుకు.. లక్షణాలు, నరాల పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా స్పైనల్ టాప్, ఎలక్ట్రోమియోగ్రఫీ వంటి టెస్టులు ఈ వ్యాధిని ఖచ్చితంగా కనుగొనేందుకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ సిండ్రోమ్ సోకిన వారికి విపరీతమైన నీరసం ప్రధాన లక్షణం అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరొలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ తెలిపింది. మెట్లు ఎక్కడం, నడవడం వల్ల బాగా నీరసం, అలసట వస్తే అది మొదటి లక్షణంగా భావించవచ్చని పేర్కొంది. అనంతరం శ్వాస తీసుకునే కండరాలు బలహీనపడి.. చివరికి కృత్రిమ శ్వాస తీసుకునే పరిస్థితి వస్తుందని వివరించింది. ఇలాంటి లక్షణాలు కనిపించిన తర్వాత 2 వారాల్లో ఇది బాగా ముదిరిపోయి ఈ వైరస్ సోకిన వారు కదలలేని దశకు చేరుకుంటారని తెలిపింది. కంటి చూపు మందగించడం, కంటి నరాలు దెబ్బతినడం, మాట్లాడటం, నమలడం, తినడం కష్టం అవుతుందని పేర్కొంది. తర్వాత చేతులు, కాళ్లలో సూదులతో గుచ్చుతున్నట్లు అనిపిస్తుందని.. బాగా ఒళ్లు నొప్పులు, బీపీ పెరగడం, జీర్ణాశయ సంబంధ సమస్యలు వస్తాయని చెప్పింది.
అయితే ఇప్పటికి చికిత్స లేదని.. మరింత ముదరకుండా క్రమంగా తగ్గించే పని చేస్తున్నట్లు వైద్య నిపుణులు చెప్పారు. దీని బారిన పడిన వారికి ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ - ఐవీఐజీ చికిత్స చేస్తున్నట్లు వివరించారు. ఇది ముఖ్యంగా నరాలపై వైరస్ దాడి చేయకుండా రోగ నిరోధక శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు.