నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఎవరెస్ట్ శిఖరం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. మంగళవారం ఉదయం 10 గంటలకు సోలుకుంబు నుంచి ఖాట్మండుకు హెలికాప్టర్ బయల్దేరింది. అందులో ఐదుగురు విదేశీ ప్రయాణికులు, ఒక కెప్టెన్ ఉన్నారు. అయితే హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే.. కంట్రోల్ టవర్ నుంచి సిగ్నల్స్ కట్ అయిపోయాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల 12 నిమిషాలకు 9 NMV హెలికాప్టర్ రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని.. త్రిభువన్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్ట్ మేనేజర్ జ్ఞానేంద్ర భల్ వెల్లడించారు.
హెలికాప్టర్ మిస్సింగ్ అయినట్లు గుర్తించి వెంటనే సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు జ్ఞానేంద్ర భల్ తెలిపారు. ఖాట్మండు నుంచి రెస్య్కూ సిబ్బందితో కూడిన హెలికాప్టర్‌ను పంపించిటన్లు నేపాల్ పౌర విమానయాన శాఖ వర్గాలు ట్వీట్ చేశాయి. హెలికాప్టర్ మిస్సింగ్ సమయంలో అందులో మొత్తం ఆరుగురు ఉన్నారని.. అందులో ఒకరు హెలికాప్టర్ కెప్టెన్ కాగా.. మరో ఐదుగురు మెక్సికో దేశానికి చెందిన ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.
గాలింపు చేపట్టిన అధికారులు హెలికాప్టర్ కూలిపోయనట్లు గుర్తించారు. లమజురా దండా ప్రాంతంలోని లిఖు పీకే, దూద్‌కుండా మున్సిపాలిటీ సరిహద్దుల్లో కూలిన హెలికాప్టర్‌ను రెస్య్కూ సిబ్బంది కనుగొన్నట్లు కోషి ప్రావిన్స్ డీఐజీ రాజేశ్‌నాథ్ బస్తోలా వెల్లడించారు. అయితే కొండపైన చెట్టును ఢీకొట్టి హెలికాప్టర్ కూలినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో హెలికాప్టర్ శకలాలతోపాటు ఐదుగురి మృతదేహాలను గుర్తించారు. అయితే ఈ ఐదుగురు ఎవరు అనేది ఇంకా నిర్ధారించలేదని డీఐజీ రాజేశ్‌నాథ్ బస్తోలా తెలిపారు. అయితే హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిన కొంత సమయంలోనే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. లమజురా ప్రాంతంలోని చిహాన్‌దండ గ్రామంలో హెలికాప్టర్ కూలడానికి కొన్ని సెకన్ల ముందు పెద్ద శబ్ధం వినిపించనట్లు గ్రామస్థులు చెప్పారని.. పోలీసులు వివరించారు.