ప్రకాశం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. బుధవారం ఆయన ప్రకాశం జిల్లా పొదిలిలోని ఎన్జీవో కాలనీకి ఆర్టీసీ అధికారులతో కలిసి వచ్చారు. దర్శి సాగర్ కాలువలో ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 45 ఏళ్లుగా మత పెద్దగా, మసీదు మంచిచెడులు చూసుకుంటున్న అబ్దుల్ హజీజ్, భార్య అబ్దుల్ హనీ, మనవరాలు షేక్ హీనా మృతిచెందడం కలిచివేసిందన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన హిదయతుల్లా కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా, క్షతగాత్రులు మాట్లాడుతూ ఈ ప్రమాదం ఊహించనిదని, అదే డీజిల్ ట్యాంక్, ఏసీ గ్యాస్ సిలిండర్ పేలితే ఏ ఒక్కరమూ మిగిలేవారం కాదంటూ ప్రమాదాన్ని గుర్తుచేసుకుంటూ విలపించారు.