ఈనెల 21వ తేదీన చిత్తూరు జిల్లా, వెంకటగిరికి సీఎం జగన్ రానున్నట్టు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. నేతన్న నేస్తం పథకం కింద అక్కడ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. వాస్తవానికి 21వ తేదీన ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలో చేపట్టాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వెంకటగిరిలోనే నిర్వహించాలని పట్టుబట్టినట్టు సమాచారం. వెంకటగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు అధిక సంఖ్యలో వుండడంతో పాటు ఇటీవల యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ చేనేత కార్మికులకు చేరువయ్యేలా హామీలు, వెబ్‌సైట్ ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో చేనేత వర్గాల్లో నారా లోకేశ్ ప్రభావం తగ్గించే యత్నాల్లో భాగంగానే మంగళగిరికి బదులు వెంకటగిరిలో సీఎం పర్యటన జరపాలని రామ్‌కుమార్ కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కలెక్టర్ వెంకట్రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, ఆర్డీవో కిరణ్‌కుమార్ తదితరులు గురువారం వెంకటగిరిలో పర్యటించారు.విశ్వోదయ జూనియర్ కళాశాల, గురుకుల పాఠశాల మైదానాల్లో సీఎం హెలిపాడ్, ఆయన పాల్గొనే బహిరంగసభల ప్రదేశాలను పరిశీలించారు.ఎమ్మెల్సీ మేరిగ మురళి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ భానుప్రియ, వెంకటేశ్వర్లు, ఎంపీడీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బి.వి. రమణయ్య తదితరులు పాల్గొన్నారు.