ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందువరుసలో ఉందని కేంద్రప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రడూన్‌లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ కేంద్ర సమాఖ్య 15వ కాన్ఫరెన్స్‌ను స్వాస్థ్య చింతన్ శివిర్ పేరుతో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ, వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర సహాయ మంత్రులు భారతీప్రవీణ్ పవార్, ఎస్పీ సింగ్ భాగేలా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్‌దామీ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్త, 15 రాష్ట్రాలకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు పాల్గొన్నారు. ఏపీ తరపున మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న వైద్య విధానరాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వైద్య విధానాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఈ ప్రజంటేషన్‌లో ఏపీ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు కురిపించింది. పలు అంశాల్లో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చాలా బాగున్నాయని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా అక్కడి ప్రభుత్వ విధానాలు ఉన్నాయని చెప్పింది.