పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో పెనుప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే... కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీవీలు అమర్చేందుకు ఓ ఎలక్ట్రీషియన్ సహాయకుడు వచ్చాడు. అయితే టీవీలు అమర్చిన ఆ సహాయకుడు అంతటి ఊరుకోకుండా... విద్యార్థులకు ఇచ్చిన బల్లకు విద్యుత్ వైర్లను అంటించాడు. దీంతో విద్యార్థులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. పలుమార్లు ఎలక్ట్రిషియన్ సహాయకుడు ఇలానే చేయడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గ్రామంలోని ఆర్‌ఎంపీకి విద్యార్థులను చూపించారు. వారి ఆరోగ్యం కుదిటపడిన వెంటనే విద్యార్థులను ఇంటికి పంపించారు. అయితే ఈ విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.