డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బోరు బావిలో నుంచి మంటలు చెలరేగడం కలకలంరేపుతోంది. రాజోలు మండలం శివకోడులో రొయ్యల చెరువులకు నీళ్లు కోసం బోరుబావిని తవ్వారు.. అయితే అందులో నుంచి గ్యాస్ బయటకు వస్తోంది. ఒక్కసారిగా గ్యాస్ మండటంతో ఓఎన్జీసీ స్థానికులు సమాధానం ఇచ్చారు. వెంటనే ఓఎన్జీసీ సిబ్బంది, అధికారులు అక్కడికి చేరుకున్నారు. మంటలార్పేందుకు అగ్నిమాపక, ఓఎన్జీసీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఆ మంటల్ని ఆర్పేసి.. బోరు బావిలో నుంచి గ్యాస్ రావడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.
సంఘటన స్థలానికి మూడు వైపులా ఓఎన్జీసీని ఆన్ షోర్ బావులను మూసివేశారు. ఈ గ్యాస్ లైన్ నివాస స్థలాలకు దూరంగా ఉండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బోరుబావిలోంచి గ్యాస్ రావడానికి గల కారణాలు పరిశీలించారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో గ్యాస్ కోసం గతంలో సెస్మిక్ సర్వే జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆక్వా చెరువుల్లో నీటి కోసం అదే చోట 6 ఏళ్ల కిందట బోరు వేయగా.. రెండు రోజుల కిందట ఈ బోరును మరింత లోతుకు తవ్వారట.
ఆ వెంటనే భూమిలోని గ్యాస్ బయటికి వచ్చి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. పైప్‌లైన్ అయితే గ్యాస్‌ను నిలిపివేసి మంటలను ఆపేవాళ్లమన్నారు. కానీ, భూమిలో నుంచి నిరంతరంగా గ్యాస్ వస్తుండటంతో.. మంటలు అదుపు చేయడం కష్టంగా మారిందన్నారు.కోనసీమ జిల్లాలోని గ్రామాల మీదుగా ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ వెళుతోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.