అమెరికా డాలర్ 15 నెలల కనిష్ఠానికి చేరుకోవడం, అలాగే అమెరికా సీపీఐ రెండేళ్ల కనిష్ఠానికి చేరుకోవడంతో బంగారం ధరలు తిరిగి పుంజుకున్నాయి. వెండి ధరలు కూడా అదే బాట పట్టాయి. బులియన్ ఇన్వెస్టర్లలు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ నిన్న గడువు ముగిసే సమయానికి 10 గ్రాములకు రూ.95 పెరిగి రూ.59,334 స్థాయుల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,955 డాలర్ల స్థాయిలో ముగిసింది. ఎంసీఎక్స్ లో శుక్రవారం వెండి ధర కిలోకు రూ.664 పెరిగి రూ.75,990 వద్ద, అంతర్జాతీయ మార్కెట్లో 24.920 డాలర్ల వద్ద ముగిశాయి.
అంతకుముందు తగ్గిన బంగారం ధరలు గతవారం నుండి పెరుగుతూ వస్తున్నాయి. దీనిపై బులియన్ మార్కెట్ నిపుణులు మాట్లాడుతూ... కిందటి వారం అమెరికా సీపీఐ డేటా విడుదలైందని, ఈ డేటా ప్రకారం ద్రవ్యోల్భణం రెండేళ్ల కనిష్ఠానికి చేరుకుందని తెలిపారు. అదే సమయంలో యూఎస్ ఫెడ్ సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెంచదనే అంచనాలు కూడా ఉన్నాయన్నారు. దీంతో అమెరికా డాలర్ నష్టపోయిందని, ఏకంగా పదిహేను నెలల కనిష్ఠానికి చేరుకున్నట్లు చెప్పారు. ఈ అంశాలు బంగారం పెరుగుదలకు కారణమైనట్లు చెప్పారు.
డాలర్ ఇండెక్స్ పదిహేను నెలల కనిష్ఠానికి చేరుకోవడం, ద్రవ్యోల్భణం అంచనాలకు మించి ఉండటంతో, ఫెడ్ వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించవచ్చునని భావిస్తున్నారని, ఈ ప్రభావం పసిడిపై పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పసిడి ధరలు మూడు వారాల గరిష్ఠానికి చేరుకున్నాయి. జూన్ మాసంలో సీపీఐ ఏడాది ప్రాతిపదికన 3.1 శాతం వరకు ఉండవచ్చునని అంచనా వేయగా, 3 శాతం నమోదయింది.