ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్లో మాట్లాడే క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి జనసేన నాయకురాలు రాయపాటి అరుణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ప్రైమ్ 9 ఛానెల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న అరుణ.. వైసీపీ నేత సుందర రామ శర్మ మాటలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడిందని.. కానీ చిరంజీవిది ఏముంది.. వెళ్లి మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారంటూ మాట్లాడారు. ఆమె చాలా విషయాలు మాట్లాడినప్పటికీ.. రాజకీయ ప్రత్యర్థులు తమకు అవసరమైన ఈ బిట్‌నే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
దీంతో ‘దయచేసి జనసేన అభిమానులు.. అలాగే నా మీద అభిమానం చూపించే సోదరులెవరూ ఇప్పుడు జరుగుతున్న డిస్టర్బన్స్‌లో రిప్లైలు ఇవ్వొద్దు. పూర్తిగా వీడియో చూసిన వాళ్లెవరూ నన్ను తిట్టరు. కావాలని అన్నదమ్ములిద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టి జనసేనకు నష్టం చేయాలనేది వైసీపీ ప్లాన్’ అని రాయపాటి అరుణ ట్వీట్ చేశారు. పిల్ల బిజ్జల ఏవో పిల్ల ఎడిట్‌లు చేసి చిరంజీవి ఫ్యాన్స్‌ను, కుల సంఘాలను నాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే కుట్ర చేస్తున్నాడంటూ ఆమె సెటైర్లు వేశారు.
‘‘జగన్ సోనియా గాంధీని ఎదిరించారని మీరు చెబుతున్నారు. కాంగ్రెస్‌ను ఎదిరించిన నాయకుడైతే.. ఆయన పార్టీ పేరులో కాంగ్రెస్ అని ఎందుకుంది..? స్వతహాగా ఎదిగాడని అంటున్నారు.. తండ్రి చనిపోయినప్పుడు.. వీళ్ల వాళ్లలో ఎవరికీ ఏమీ కాలేదు గానీ.. జనం చనిపోయారని ఓదార్పు యాత్ర ఎందుకు చేపట్టారు..?’’ అని అరుణ ప్రశ్నించారు. వైఎస్ బొమ్మ లేకుండా ఇప్పటికీ ప్రజల్లోకి వెళ్లే ధైర్యం జగన్‌కు లేదని ఆమె ఎద్దేవా చేశారు.
‘‘చిరంజీవి రాజకీయంగా ఓటమిపాలైనప్పటికీ.. పవన్ కళ్యాణ్ ధైర్యంగా పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం కేడర్‌ను ఒకర్నంటే ఒకర్ని కూడా తనతో కలిసి పని చేయాలని అడగలేదు. ఇంకా చెప్పాలంటే చిరంజీవికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినట్లు అవుతుంది గానీ.. తప్పనిసరి పరిస్థితి ఇది. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్‌కు ఫెయిల్యూర్ పాత్ వేశారు. చిరంజీవి ఆ రోజు పార్టీని విలీనం చేయకపోయి ఉంటే.. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయం కానీయండి, చిరంజీవి జీవితం కానీ.. పవన్ కళ్యాణ్ జీవితం కానీ ఇంకోలా ఉండేవి. జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి గానీ.. కడప నుంచి వచ్చిన దుష్ట చతుష్టయం కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉండేవారే కాదు. వీళ్లకు రాజకీయ భిక్షే ఉండేది కాదు.
కానీ చిరంజీవి గారి సున్నిత మనస్తత్వంతో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం.. ఏపీ రాజకీయాలకు తీరని దెబ్బ. అది వాళ్ల కుటుంబంబపైనే కాదు రాష్ట్ర ప్రజలపైనా పడింది. చిరంజీవి గారెళ్లి సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన రూపాయి కూడా ఆశించకుండా ఎంతో మంది బీసీలకు టికెట్లు ఇచ్చారు. ఇవాళ వైసీపీలో ఉన్న సగం క్యాడర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది చిరంజీవి గారు. ఆయన సీట్లు అమ్ముకున్నాడని అంటున్నారు. వాళ్లంతా వైసీపీలోనే ఉన్నారు కదా.. బయటకు వచ్చి రూపాయి తీసుకున్నాడని చెప్పమనండి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరే.. ఎవరి దగ్గర్నుంచి లాక్కోకుండా స్వతహాగా పార్టీ పెట్టారు’’ అని రాయపాటి అరుణ వ్యాఖ్యానించారు.
కానీ అరుణ చిరంజీవిని విమర్శించినట్లు ఉన్న పార్ట్‌నే సోషల్ మీడియాలో ప్రత్యర్థి వర్గం వదలడంతో.. ఆమె ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. జనసైనికులు రియాక్ట్ అవ్వొద్దని కోరుతూనే.. వైసీపీపై సెటైర్లు వేస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు చిరంజీవి ఫ్యాన్స్ రాయపాటి అరుణ తీరును తప్పుబడుతుండగా.. మరికొందరు ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. జనసైనికులు ఆమెకు అండగా నిలుస్తున్నారు.