మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కేసు విచారణ జరగ్గా.. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని సీబీఐ కోర్టును కోరింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేయడంతో పాటు తాజా చార్జిషీట్, కేసు ఒరిజినల్ ఫైల్‌ను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అవినాష్ కేసుపై ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా సీరియస్ అంశమని.. గంగిరెడ్డి, అవినాష్ బెయిల్ కలిపే వింటామని తెలిపింది. గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ వేరుగా వినాలని గంగిరెడ్డి తరపు న్యాయవాది కోరగా.. అవినాష్ రెడ్డి బెయిల్‌తో పాటు వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది.
జూన్ 30న దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సుప్రీంకోర్టు సూచించింది.ఈ కేసులో రెండు వారాల్లో రిప్లై పిటిషన్ దాఖలు చేయాలని.. నోటీసులపైన రిజాయిండర్లు మూడు వారాల్లో దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. జూన్ 30న దాఖలు చేసిన చార్జిషీట్ కాపీని తమ ముందు ఫైల్ చేయాలని సూచించింది. ఈ కేసులో ఇతర ప్రతివాదులందరికీ నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు.
వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును వివేకా కుమార్తు సునీత రెడ్డి సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. అవినాష్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అటు ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్ అంశంపైనా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే వివేకా కేసుకు సంబంధించి ఇప్పటివరకు సీబీఐ చేసిన దర్యాప్తునకు సంబంధించిన కేసు డైరీ వివరాలను తనకు ఇవ్వాలని సునీత సుప్రీంకోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కీలకమైన కేసులో కేసు డైరీ వివరాలను పిటిషనర్‌కు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
2019 మార్చి నెలలో ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కలకలంరేపింది. ఈ కేసును అప్పటి ప్రభుత్వం సిట్‌కు అప్పగించగా.. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసి.. హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పరిణామాలు చకచకా మారిపోగా.. కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ వివేకా సతీమణి కోర్టును కోరవడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అప్పటి నుంచి సీబీఐ రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేస్తోంది.. అనంతరం ఈ కేసు విచారణను ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు సుప్రీం కోర్టు మార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైఎస్ అవినాష్ రెడ్డితో పాటూ.. ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిల పేర్లు వైఎస్ వివేకా కేసులో బయటుకొచ్చాయి. భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయగా.. వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అవినాష్‌కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.