దొంగలు ఇళ్లలోకి చొరబడి డబ్బులు, బంగారం, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం కామన్. కానీ ఇటీవల కాలంలో దొంగలు తెలివిమీరిపోయారు. ట్రెండ్‌కు తగినట్లుగా, సీజన్‌ను బట్టి రూటు మార్చేస్తున్నారు.. లేెెటెస్ట్‌గా టమాటాలు, కూరగాయలు కూడా దోచేసున్నారు. నంద్యాలలో మాత్రం దొంగలు మరో ట్రెండ్ ఫాలో అవుతున్నారు. పెట్రోల్ ధరలు కూడా పెరగడంతో ఆ రూట్‌లో వెళుతున్నారు.
నంద్యాలలో ఈ మధ్య కాలంలో రాత్రివేళల్లో ఇంటి బయట పార్కింగ్ చేసే బైకుల నుంచి పెట్రోల్ దొంగలిస్తున్న ఘటనలు ఎక్కువైపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలో ఉన్న విజయ నగర్ కాలనీలో ఒక్క రాత్రే ఏకంగా 10 బైకుల్లో పెట్రోల్‌ను దొంగలు చోరీ చేశారు. ఈ తతంగమంతా స్థానికంగా ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఓ వ్యక్తి ఖాళీ వాటర్ బాటిళ్లు, డబ్బాలు తీసుకొచ్చి బైకుల నుంచి పెట్రోల్ నింపుకుని వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది.
దీనిపై నంద్యాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైకులు ఇంటి బయట పార్క్ చేయాలంటే భయమేస్తోందని.. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాత్రివేళల్లో పోలీసులు గస్తీ పెంచి ఇలాంటి దొంగతనాలను అరికట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. గతంలో కూడా పలు పట్టణాల్లో ఇలాంటి తరహా చోరీలు జరిగాయి. ఇప్పుడు నంద్యాలలో కూడా మొదలయ్యాయి.