జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సీపీఐ నేత నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో నారాయణ తీవ్రంగా స్పందించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) మిత్రపక్ష కూటమి సమావేశానికి హాజరు కానున్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా స్పందించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్ కళ్యాణ్.. ఇవాళ ఎన్డీయేలో మళ్లీ ఎలా చేరుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ తీరు బాధాకరమని, ఇది సరికాదని ఆక్షేపించారు.పవన్ కళ్యాణ్ ఒక దళారీ అని.. అందుకే భారతీయ జనతా పార్టీ- తెలుగు దేశం పార్టీలను అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యవర్తిత్వం అస్సలు మంచిది కాదన్నారు. గతంలో పవన్ కళ్యాణే ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చారని గుర్తు చేశారు. రాష్ట్రానికి అసలు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో ఎలా అంటకాగుతారని పవన్ కళ్యాణ్‌ను నారాయణ నిలదీశారు. పైగా బీజేపీతో కలవడం.. లౌకిక వాదానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.
ఇక, నిన్నటి వరకు చేగువేరా దుస్తులు వేసుకుని.. ఇప్పడు సావర్కర్ దుస్తులు వేసుకునేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారని సీపీఐ నేత నారాయణ అన్నారు. రేపు మహాత్మా గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేలా తుపాకీ పట్టుకునేందుకు కూడా సిద్ధమవుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు అసలు నిలకడ లేదన్నారు. కదలకుండా మూడు నిమిషాలు మాట్లాడగలిగితే.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ స్థిరత్వం గురించి మాట్లాడుకోవచ్చని ఎద్దేశా చేశారు.