ఏపీలో టమాటా రైతుల వరుస హత్యలు కలకలంరేపుతున్నాయి. గతవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలో టమాటా రైతును దారి కాచి దారుణంగా హతమార్చగా.. తాజాగా మళ్లీ అదే జిల్లాలో టమాటా పంటకు కాపలాగా వెళ్లిన అన్నదాత దారుణ హత్యకు గురయ్యాడు. పెద్ద తిప్పసముద్రంకు చెందిన రైతు మధుకర్ రెడ్డి తన పొలంలో టమాటా పంట సాగు చేశారు. టమాటాకు ధరలు భారీగా పెరిగడంతో డిమాండ్ పెరిగింది. దీంతో మధుకర్ రెడ్డి తన పొలం దగ్గర ఉంటున్నారు.. ఈ క్రమంలో రాత్రి సమయంలో కూడా పంటకు కాపాలాగా ఉంటున్నాడు.
మధుకర్ రెడ్డి ఆదివారం రాత్రి కూడా తన టమాటా పంటకు కాపలాగా ఉన్నాడు. ఈ క్రమంలో రైతు నిద్రిస్తున్న సమయంలో అతడ్ని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. సోమవారం ఉదయం పొలం దగ్గరకు వెళ్లిన స్థానికులు మధుకర్ రెడ్డి మృతదేహాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ హత్యపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. దుండగులు మధుకర్ రెడ్డిని హత్య చేసి టమాటాలను తీసుకెళ్లినట్లు చెబుతుండగా.. వివాహేతర సంబంధం విషయంలో గొడవలతో హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వారం క్రితం అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని బోడుమల్లదిన్నేలో కూడా టమాటా రైతు రాజశేఖర్ రెడ్డి కూడా హత్యకు గురయ్యారు. ఆయన పొలం దగ్గర నివాసం ఉంటున్నారు.. ఆయన పాలు పోసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా.. మార్గ మధ్యలో ఆయన్ను దారుణంగా హత్య చేశారు. చేతులు, కాళ్లు కట్టేసి గొంతు నులిమి హతమార్చారు.. టమాటాలు అమ్మిన డబ్బుల్ని దోచుకునేందుకు హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.