టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందడం.. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపించడంతో ఏ విషయమైనా క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది. అయితే మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీ, బీజేపీ నేత కిరీట్ సోమయ్యకు సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కిరీట్ సోమయ్య అభ్యంతరకరమైన రీతిలో ఉండటంతో అది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా తయారైంది. ఇప్పటికే మహారాష్ట్రలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్న వేళ.. ఈ వీడియో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి తెరతీసింది.
అయితే కిరీట్ సోమయ్యకు చెందిన ఈ వీడియోను ఓ మరాఠా ఛానల్ ప్రసారం చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ ఒక్క వీడియోతో అధికార పార్టీ అసలు స్వరూపం బయటికి వచ్చిందని ఆరోపించాయి. మహిళలను వేధింపులకు గురిచేస్తున్న కిరీట్ సోమయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. చాలా మంది ఎంపీలను, ఎమ్మెల్యేలను కిరీట్ సోమయ్య బెదిరించాడని కాంగ్రెస్ నాయకురాలు యశోమతి ఠాకూర్ ఆరోపించారు. అనేక మంది మహిళలను కూడా బ్లాక్ మెయిల్ చేసినట్లు ఈ వీడియోతో రుజువు అయిందని ఆమె మండిపడ్డారు. కిరీట్ సోమయ్యపై చర్యలు తీసుకునే ధైర్యం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని ఆమె ప్రశ్నించారు.
అయితే మరాఠా ఛానల్‌లో ప్రసారమైన వీడియో, ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.. దానిపై వస్తున్న ఆరోపణలు, కామెంట్లపై కిరీట్ సోమయ్య స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తాను ఏ మహిళను కూడా వేధింపులకు గురి చేయలేదని, ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. ఈ వీడియోపై దర్యాప్తు జరిపించాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సోమయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక లేఖను కూడా దేవేంద్ర ఫడ్నవీస్‌కు రాశారు. దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.